స్టార్‌బక్స్‌తో పోటీకి సిద్ధమైన రిలయన్స్!
దేశీయ బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్, కాఫీ చెయిన్ టాటా స్టార్‌బక్స్‌తో పోటీకి సిద్ధమవుతోంది.
ముంబై: దేశీయ బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్, కాఫీ చెయిన్ టాటా స్టార్‌బక్స్‌తో పోటీకి సిద్ధమవుతోంది. అందులో భాగంగా దేశీయంగా ముంబైలోని బార్లా కుంద్రా కాంప్లెక్స్(బీకేసీ)లో బ్రిటిష్ ఫుడ్, కాఫీ చెయిన్ బ్రాండ్ 'ప్రెట్ ఏ మాంగర్' మొదటి స్టోర్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరణ ఉంటుందని, మొదట 10 స్టోర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రెట్ ఏ మాంగర్‌తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని, రాబోయే ఐదేళ్లలో 100 ప్రెట్ ఏ మాంగర్ స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్సన్ మెహతా చెప్పారు. ప్రెట్ ఏ మాంగర్ స్టోర్లలో శాండ్‌విచ్‌లు, సలాడ్‌లు, సూప్‌లతో పాటు వివిధ ఆర్గానిక్ కాఫీ, టీ, షేక్స్, స్మూతీలను వినియోగదారులకు అందించనున్నట్టు కంపెనీ వివరించింది.
దేశంలో ఆహార మార్కెట్ వేగవంతంగా వృద్ధి చెందుతోందని మెహతా తెలిపారు. కాగా, లండన్‌కు చెందిన ప్రెట్ ఏ మాంగర్ 1986లో ప్రారంభమైంది. యూకే, యూఎస్, హాంకాంగ్, ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్, బ్రసెల్స్, సింగపూర్, జర్మనీ సహా పలు దేశాల్లో 550 స్టోర్లను నిర్వహిస్తోంది.
Also Read...