త్వరలో పేటీఎం వ్యవహారంపై ఆర్‌బీఐ స్పష్టత
మార్చి 15లోపు అన్ని పైప్‌లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాల సెటిల్. అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొంత వివరణ ఇవ్వొచ్చని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి అన్నారు. గతవారం పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి కస్టమర్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లు అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మార్చి 15లోపు అన్ని పైప్‌లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాలను సెటిల్ చేయాలని ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కోరింది. ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలను అనుమతించవచ్చని స్పష్టం చేసింది. అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడం లేదా కంపెనీ బోర్డును రద్దు చేసే అంశాన్ని ఆర్‌బీఐ పరిగణించవచ్చని వివేక్ జోషి వివరించారు. వినియోగదారుల ప్రయోజనాల కోసమే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 'కంపెనీ రెగ్యులేటర్ అవసరాలకు అనుగుణంగా లేదు. ఆర్‌బీఐ పరిస్థితులను గమనిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటుందని' జోషి వివరించారు. మరోవైపు ప్రస్తుత కంపెనీ పరిస్థితిపై కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైనట్టు సమాచారం. 10 నిమిషాలు మాత్రమే జరిగిన ఈ చర్చలో, ఇందులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఆర్‌బీఐతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి సూచించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్‌బీఐ అధికారులతో చర్చించేందుకు విజయ్ శేఖర్ శర్మ సమావేశం అవనున్నట్టు తెలుస్తోంది.