వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచనున్న ఆర్‌బీఐ: డీబీఎస్ గ్రూప్!
నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ వచ్చే నెలలో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) సమావేశంలో కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచుతుందని డీబీఎస్ గ్రూప్ తెలిపింది.
న్యూఢిల్లీ: నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ వచ్చే నెలలో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) సమావేశంలో కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచుతుందని డీబీఎస్ గ్రూప్ తెలిపింది. పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచేందుకు గతేడాది మే నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో కీలక రెపో రేటు 6.50 శాతానికి చేరుకుందని డిబీఎస్ గ్రూప్ సోమవారం ప్రకటనలో పేర్కొంది.
రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నందున ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకే సిద్ధమవుతుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఎకనమిస్ట్ రాధికా రావు అన్నారు. అయితే, సరఫరా సమస్య వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కఠిన పాలసీ విధానంతో మాత్రమే పరిష్కరించలేదని రాధికా రావు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి కంటే స్వల్పంగా తగ్గినప్పటికీ ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎగువన 6.44 శాతంగా నమోదైంది. కాగా, ఆర్‌బీఐ తదుపరి ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 6న జరగనుంది.