RBI: వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

భారత్ గత కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణంతో పోరాడగా, ఇటీవల కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పట్టింది.

Update: 2024-09-13 09:06 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ గత కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణంతో పోరాడగా, ఇటీవల కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తుండగా, తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ ఒక సమావేశలో కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో ఉండదని సంకేతాలు ఇచ్చారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన ఫోరమ్‌లో శుక్రవారం గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం పరిధిలోకి తీసుకువచ్చాం. కానీ మా లక్ష్యం 4 శాతం. గత ద్రవ్య విధాన సమావేశాల్లో, ద్రవ్యోల్బణం కారణంగా నష్టపోకుండా ఉండాల్సిన అంశాలపై చర్చించాం. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ వెంటనే వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని చెప్పారు.

దేశంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండటం వల్ల మొదటి త్రైమాసికంలో నెమ్మదించిన వృద్ధి, ఈ సంవత్సరం చివరిలో 7.2 శాతం నమోదు అవుతుందని దాస్ అంచనా వేశారు. సేవల ఎగుమతులు పుంజుకున్నాయని, అయితే బాహ్య డిమాండ్ మునుపటిలా బలంగా లేనందున భారతదేశ సరుకుల ఎగుమతి మెరుగుదల అంచనా కంటే తక్కువగా ఉందని దాస్ చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో భారత్ తన వృద్ధిని కొనసాగించగలదని ఆయన అన్నారు.

ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ జాగ్రత్తగా, వివేకంతో ఉండాలని గవర్నర్ ప్రపంచ ద్రవ్య అధికారులను కోరారు. ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో 18 నెలలకు పైగా వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండడంతో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ECB) వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అలాగే, అమెరికా ఫెడ్ కూడా వడ్డీ రేట్ల కోత విధించడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తదుపరి సమావేశంలో భారత్‌లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని అందరూ భావించగా, తగ్గింపుపై ఎలాంటి ప్రకటన ఉండదని దాస్ సంకేతాలు ఇవ్వడం గమనార్హం.


Similar News