ఎన్నికల నేపథ్యంలో భారత్-బ్రిటన్ చర్చలకు బ్రేక్
భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు ముగిశాయి. ఎన్నికల నేపథ్యంలో బ్రేక్ ఇచ్చినట్లు, ఎన్నికల అనంతరం తిరిగి చర్చలు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు ముగిశాయి. ఎన్నికల నేపథ్యంలో బ్రేక్ ఇచ్చినట్లు, ఎన్నికల అనంతరం తిరిగి చర్చలు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడనుండటంతో దేశం మొత్తం కూడా ఎన్నికల హడావిడిలో ఉంటుంది. అలాగే, బ్రిటన్‌లో కూడా ప్రధానిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో భారత్-యూకే వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలకు తాత్కాలిక విరామం ఇవ్వడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. తాజాగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు.
చర్చల నుంచి పూర్తిగా వైదొలగడం లేదు. వస్తువులు, సేవలు, పెట్టుబడికి సంబంధించి ఉమ్మడి ఆశయానికి అనుగుణంగా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఏకాభిప్రాయానికి రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ డీల్ కోసం చాలా కష్టపడ్డాం, ఎన్నికలు పూర్తయిన తర్వాత తదుపరి దఫా చర్చలు జరుగుతాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. భారత్-బ్రిటన్ మధ్య ఉమ్మడి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు 2022లో ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఈ డీల్‌ను ముందుకు తీసుకేళ్లడంపై ఫోన్లో మాట్లాడుకున్నారు. గత రెండేళ్లుగా జరుగుతున్న ఈ డీల్‌పై ఇప్పటివరకు 14 విడతలుగా చర్చలు జరిగాయి.