ప్రూఫ్ ఆఫ్ బర్త్ కోసం ఇచ్చే డాక్యుమెంట్ల జాబితా నుంచి ఆధార్ తొలగింపు
ఇకమీదట ఆధార్ కార్డును ప్రైమరీ ఐడెంటిటీ వెరిఫికేషన్ డాక్యుమెంట్‌గానే మాత్రమే పరిగణించాలని, జనన ధృవీకరణకు ప్రామాణికం కాదని
దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఖాతాదారులు జనన ధృవీకరణ కోసం ఇచ్చే డాక్యుమెంట్ల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆదేశాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇకమీదట ఆధార్ కార్డును ప్రైమరీ ఐడెంటిటీ వెరిఫికేషన్ డాక్యుమెంట్‌గా మాత్రమే పరిగణించాలని, జనన ధృవీకరణకు ప్రామాణికం కాదని తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. దీన్ని గురువారం సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(సీపీఎఫ్‌సీ) ఆమోదించింది. ఇటీవల పలు కేసుల్లో కోర్టులు ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్‌గా గుర్తించడం వీలవదని తీర్పు ఇచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆధార్‌ను చూసి పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇకపై ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రూఫ్ ఆఫ్ బర్త్ కోసం ప్రభుత్వ గుర్తింపు ఉన్న విద్యా బోర్డు, యూనివర్శిటీ మార్కుల లిస్ట్, స్కూల్ ట్రాన్స్‌ఫర్ లేదా స్కూల్ లీవ్ సర్టిఫికేట్, ఎస్ఎస్‌సీ సరిటిఫికేట్(ఇందులో పేరు, పుట్టిన తేదీ ఉంటే), సర్వీస్ రికార్డు ఆధారంగా జారీ అయిన సర్టిఫికేట్, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పెన్షన్ సర్టిఫికేట్, ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ సర్టిఫికేట్, పాస్‌పోర్టు, పాన్‌కార్డ్, సివిల్ సర్జర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్‌లను సమర్పించవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది.