ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన పీఎన్‌బీ, ఎస్‌బీఐ బ్యాంకులు!

ముంబై: ప్రభుత్వ రంగ ప్రంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది..Latest Telugu News

Update: 2022-06-14 08:34 GMT

ముంబై: ప్రభుత్వ రంగ ప్రంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏడాది నుంచి పదేళ్ల కాలవ్యవధులకు సంబంధించి రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై సవరించిన రేట్లు వర్తిస్తాయని, తక్షణమే అమల్లోకి రానున్నాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణ ఖాతాదారుల కోసం 1-2 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 5.20 శాతం వడ్డీని అందజేయనుండగా, 2-3 ఏళ్ల కాలానికి 5.30 శాతం, 3-5 ఏళ్ల కాలవ్యవధి ఉండే ఎఫ్‌డీలపై 5.50 శాతం వడ్డీని ఇవ్వనున్నట్టు పేర్కొంది.

5-10 ఏళ్ల కాలానికి సంబంధించి 5.60 శాతం, 1,111 రోజుల కాలవ్యవధి ఉండే ఎఫ్‌డీలపై 5.50 శాతానికి వడ్డీ రేట్లను పెంచుతూ పీఎన్‌బీ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రూ. 2-10 కోట్ల మధ్య ఉన్న ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు, బ్యాంకు సిబ్బంది ఖాతాలపై అదనపు వడ్డీ లభిస్తుందని బ్యాంకు వెల్లడించింది. సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారుల కంటే అదనంగా మరో 50 బేసిస్ పాయింట్లు(0.50 శాతం) ఎక్కువ వడ్డీ లభించనుంది. మిగిలిన కాలవ్యవధులు కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉండనున్నాయని బ్యాంకులు స్పష్టం చేసింది. ఇక, ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సైతం ఎంపిక చేసిన కాలవ్యవధులపై రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉండే ఎఫ్‌డీలకు 15-20 బేసిస్ పాయింట్లు వడ్డీ పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. 211 రోజుల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై 4.40 శాతం నుంచి 4.60 శాతానికి పెంచింది. 1-2 ఏళ్ల కాలవ్యవధి ఉండే ఎఫ్‌డీలపై 5.30 శాతం, 2-3 ఏళ్ల కాలవ్యవధిపై 5.35 శాతం వడ్డీని ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. పెంచిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమలవుతాయని బ్యాంకు వెల్లడించింది. 


Similar News