స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఫోన్‌పే!
డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
బెంగళూరు: డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. స్టాక్ మార్కెట్ రంగంలో పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా వెల్త్ బ్రోకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. షేర్ మార్కెట్ పేరుతో ప్రారంభించిన ఈ యాప్‌లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) వంటి సేవలను అందించనుంది. గత కొన్నేళ్లలో ఈక్విటీల్లో భారీగా పెట్టుబడులు రావడాన్ని గమనించాం.
ఈ విభాగంలో ఉన్న వ్యాపార వృద్ధిని పరిగణలోకి తీసుకుని టెక్నాలజీ నైపుణ్యం, విస్తరణ సహా మెరుగైన సేవలతో షేర్ మార్కెట్ యాప్ వినియోగదారులకు చేరువవుతుందని షేర్ మార్కెట్ సీఈఓ ఉజ్వల్ జైన్ అన్నారు. ఇప్పటికే ఫోన్‌పే బీమా ప్లాన్‌లతో పాటు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల సేవలందిస్తోంది. నాలుగేళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్ రంగంలో ప్రవేశించాం. ఇటీవల రుణాలు, బీమా, చెల్లింపులను తెచ్చిన తర్వాత స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ పేర్కొన్నారు.