సినిమా, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపార విక్రయానికి జొమాటోతో పేటీఎం చర్చలు
ఈ వ్యాపారాలను కొనేందుకు అనువైన ఇతర కంపెనీలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: కష్టాల్లో ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం సేల్స్ పడిపోవడంతో పునరుద్ధరణ వ్యూహాన్ని రూపొందించే పనిలో పడింది. అందులో భాగంగా పేటీఎం తన సినిమా, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి సిద్ధమైంది. దీనికోసం ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటోతో చర్చలు జరుపుతోంది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్, జొమాటో మధ్య చర్చలు అధునాతన దశలో ఉన్నాయని సమాచారం. అయితే, ఈ వ్యాపారాలను కొనేందుకు అనువైన ఇతర కంపెనీలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారం అంతర్గతంగా ఉన్నందున మిగిలిన వివరాలు తెలియరాలేదు. జొమాటోతో జరుగుతున్న చర్చలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విజయ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎం సంస్థ గత నెలలో అమ్మకాలు క్షీణించాయని తెలిపింది. దీన్ని అధిగమించేందుకు నాన్-కోర్ ఆస్తులను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగాల తొలగింపు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) చర్యల నేపథ్యంలో కంపెనీలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.