వచ్చే ఐదేళ్లకు రూ. 1,500 కోట్ల పెట్టుబడులు: పతంజలి ఫుడ్స్!

పతంజలి ఫుడ్స్ రానున్న ఐదేళ్లలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉందని కంపెనీ సీఈఓ సంజీవ్ తెలిపారు.

Update: 2023-06-18 12:16 GMT

న్యూఢిల్లీ: పతంజలి ఫుడ్స్ రానున్న ఐదేళ్లలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉందని కంపెనీ సీఈఓ సంజీవ్ తెలిపారు. సంస్థ ప్రధానంగా పామాయిల్ వ్యాపారంపై దృష్టి సారించనుంది. కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, సరఫరాను విస్తరించడం ద్వారా వచ్చే ఐదేళ్లకు రూ. 45,000-50,000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కంపెనీ తగిన మూలధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. భవిష్యత్తు వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడులను పెంచాలని నిర్ణయించాం. అందుకోసం పామాయిల్ వ్యాపార విభాగాన్ని ఎంచుకున్నాం.

అందుకోసం ఇప్పటికే 64 వేల హెక్టార్లలో పనులు కొనసాగుతున్నాయి. వంటనూనెల కోసం ఐదు లక్షల హెక్టార్లలో మరింత పామ్ పంటకు కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు. దక్షిణాదిలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలోనూ పంటలున్నాయి. వీటన్నిటి ద్వారా ప్రస్తుతానికి రూ. 31 వేల కోట్ల టర్నోవర్ జరుగుతోంది. మరో ఐదేళ్లకు రూ. 45 వేల నుంచి రూ. 50 వేల కోట్లకు చేరుకుంటామని అంచనా వేస్తున్నట్టు సంజీవ్ పేర్కొన్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రధానంగా హెల్త్ బిస్కెట్లు, న్యూట్రెలా మిల్లెట్, డ్రై ఫ్రూట్స్ వంటి కొత్త ప్రీమియం ఉత్పత్తులు కీలకంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో 5-10 శాతం ప్రీమియం ఉత్పత్తుల నుంచి తీసుకోవాలని భావిస్తున్నాం.


Similar News