SIAM: ఆగస్టులో 2% తగ్గిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు

మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్‌లను తగ్గించడంతో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఆగస్టులో సంవత్సరానికి 2 శాతం క్షీణించాయి.

Update: 2024-09-13 09:56 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్‌లను తగ్గించడంతో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఆగస్టు నెలలో సంవత్సరానికి 2 శాతం క్షీణించాయి. ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన డేటా ప్రకారం, దేశీయ మార్కెట్లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం ప్యాసింజర్ వాహనాల డెలివరీలు ఆగస్టు 2023లో 3,59,228 వాహనాలతో పోలిస్తే 1.8 శాతం తగ్గి 2024 ఆగస్టు నెలలో 3,52,921 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో మోటార్‌సైకిల్ డెలివరీలు మాత్రం ఆగస్టు 2023లో 9,80,809 యూనిట్ల నుండి గత నెలలో 8 శాతం పెరిగి 10,60,866 యూనిట్లకు చేరడం గమనార్హం.

అమ్మకాల పరంగా చూసినట్లయితే ద్విచక్ర వాహనాల హోల్‌సేల్‌లు గత నెలలో 9 శాతం పెరిగి 17,11,662 యూనిట్లకు చేరుకోగా, ఇది గత ఏడాది 15,66,594 యూనిట్లుగా నమోదైంది. అలాగే, మూడు చక్రాల వాహనాల విక్రయాలు కూడా గత ఏడాది ఆగస్టు నెలలో 64,944 యూనిట్ల నుంచి 8 శాతం వృద్ధితో 69,962 యూనిట్లకు పెరిగాయి. ఇదిలా ఉంటే రాబోయే పండుగ సీజన్‌ నేపథ్యంలో ఇప్పటికే వాహన తయారీ కంపెనీలు తమ డీలర్లకు డెలివరీలను ఎక్కువగా పెంచాయి. కస్టమర్ల కోసం డిమాండ్‌ను తీర్చడానికి కార్లు, ద్విచక్ర, త్రీవీలర్ వాహనాలను షోరూమ్‌లలో అందుబాటులో ఉంచుతున్నారు. మార్కెట్ వర్గాలు కూడా ఈ పండుగ సీజన్‌లో వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశాయి.


Similar News