UPI ట్రాన్సక్షన్లలో సరికొత్త రికార్డు
టెక్నాలజీ పుణ్యమా అని క్యాష్ కంటే యూపీఐ ట్రాన్సక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. మునుపెన్నడు లేని విధంగా యూపీఐ ట్రాన్సక్షన్లలో రికార్డులు నమోదవుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ పుణ్యమా అని క్యాష్ కంటే యూపీఐ ట్రాన్సక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. మునుపెన్నడు లేని విధంగా యూపీఐ ట్రాన్సక్షన్లలో రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో యూపీఐ ద్వారా ఏకంగా 870 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. లావాదేవీల సంఖ్య, లావాదేవీల విలువ, రెండింటిలోనూ ఈ ఏడాది మార్చిలో కొత్త రికార్డులు నమోదైనట్లు పేర్కొంది. వీటి విలువ రూ. 14 లక్షల కోట్లు. 2022 మార్చితో పోలిస్తే సంఖ్యాపరంగా యూపీఐ లావాదేవీలు 60 శాతం, విలువ పరంగా 46 శాతం ఎక్కువైనట్లు ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డేటా వెల్లడిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 9.60 లక్షల కోట్ల విలువైన 540 కోట్ల లావాదేవీలు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగాయి.
జనవరి 2023లో మొదటిసారిగా యూపీఐ 800 కోట్ల ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేసింది. కానీ, ఫిబ్రవరిలో ఇవి కొంత తగ్గాయి. 2016లో మొదలైన యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు 100 కోట్ల లావాదేవీల మార్కు అందుకోవడానికి మూడేళ్లు పట్టింది. మొత్తం డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు 75 శాతం వాటా ఉంది. కాగా, యూపీఐ ద్వారా రూ.2000 కన్నా ఎక్కువ ట్రాన్సక్షన్లు చేస్తే లావాదేవి విలువలో 1.1 శాతం పన్ను విధించనున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేసే మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.