ఎన్నికల తర్వాత భారత్‌లో AI పై కొత్త చట్టం: అశ్విని వైష్ణవ్
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత భారత్‌లో కృత్రిమ మేధస్సు(AI) నిబంధనలపై కొత్త చట్టాన్ని తీసుకువస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత భారత్‌లో కృత్రిమ మేధస్సు(AI) నిబంధనలపై కొత్త చట్టాన్ని తీసుకువస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దీని ద్వారా దేశంలో AI దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు కంటెంట్ క్రియేటర్లు, వార్తలు ప్రచురించే వారి ప్రయోజనాలు రక్షించబడతాయని ఆయన తెలిపారు. ఇటీవల భారత్‌లో AI మోడల్‌లను అమలు చేయడానికి ముందు కేంద్రం నుంచి స్పష్టమైన అనుమతి కోరాలని టెక్ కంపెనీలను ఆదేశించిన ప్రభుత్వం దీనికి మరింత కట్టుదిట్టమైన ఫ్రెమ్‌వర్క్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంది.
గత ఏడాదిలో AI ఆధారిత డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు బయటకు రావడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో AI దుర్వినియోగాన్ని కట్టడి చేయడానికి అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, అడోబ్, మెటాతో సహా అనేక పెద్ద సాంకేతిక సంస్థలు 2024 ఎన్నికలలో AI మోసపూరిత వినియోగాన్ని ఎదుర్కోవడానికి టెక్ ఒప్పందంపై సంతకం చేశాయి, ఇది తప్పుడు సమాచారాన్ని గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి, అటువంటి వార్తలను షేర్ చేయడాన్ని అరికట్టేందుకు కట్టుబడి ఉంది.