కొత్త ప్రభుత్వం ముఖ్యమైన సంస్కరణలపై దృష్టి పెట్టాలి: CII అధ్యక్షుడు
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దేశంలో పెట్టుబడి ఆధారిత సమ్మిళిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి అన్నారు
దిశ, బిజినెస్ బ్యూరో: కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దేశంలో పెట్టుబడి ఆధారిత సమ్మిళిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి అన్నారు. భూమి, కార్మికులు, వ్యవసాయం, శక్తి, ఆర్థిక స్థిరత్వం వంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లాలని పరిశ్రమల రంగం ఆశిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా చేసిన విధాన పరమైన సంస్కరణల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 8.2 శాతం వృద్ధిని కనబరిచింది. గ్లోబల్‌గా అనేక సవాళ్లు ఉన్నప్పటికి కూడా వాటన్నింటిని తట్టుకుని భారత్ నిలబడింది. ప్రభుత్వ విధానపరమైన జోక్యాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ గట్టి పునాదిలో ఉందని సంజీవ్ పూరి తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశంలోకి కొత్త కొత్త పరిశ్రమలు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పెట్టుబడి ఆధారిత సమ్మిళిత వృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సామర్థ్య వినియోగం 75 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా, ఇది రాబోయే మూలధన వ్యయ చక్రంలో ప్రైవేట్ పెట్టుబడులను మరింత ప్రేరేపిస్తుంది, ఇప్పటికే ఆర్‌బీఐ కూడా ఇదే అంచనాలను పేర్కొన్నట్లు పూరీ తెలిపారు. గత కొంత కాలంగా ఆందోళనగా ఉన్నటువంటి ప్రైవేటు రంగ పెట్టుబడి, దేశ జీడీపీలో 20.7 శాతం నుండి 23.8 శాతానికి పెరిగి, కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలను అధిగమించి విశేషమైన అభివృద్ధిని కనబరిచిందని ఆయన హైలెట్ చేశారు.
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రకటించింది. దీనికి అనుగుణంగా వారితో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయడానికి పరిశ్రమ కార్యాచరణ సిద్ధం చేయడంలో నిమగ్నం కావడానికి చూస్తామని, ఇది ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తుందని పూరి అన్నారు.