Fastag: ఫాస్టాగ్ కొత్త నిబంధనలు.. 70 నిమిషాల వరకు బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే డబుల్ ఫీజు

బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఫాస్టాగ్ కస్టమర్లకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని కేటాయించింది.

Update: 2025-02-13 18:15 GMT
Fastag: ఫాస్టాగ్ కొత్త నిబంధనలు.. 70 నిమిషాల వరకు బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే డబుల్ ఫీజు
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల ధ్రువీకరణ నిబంధనలను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌ టోల్ లావాదేవీలను క్రమబద్ధీకరించడం, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చారు. ముఖ్యంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఫాస్టాగ్ కస్టమర్లకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని కేటాయించింది. ఆ సమయంలోగా బ్లాక్‌లిస్ట్ నుంచి బయటపడటంలో విఫలమైతే రెట్టింపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఫాస్టాగ్‌లో అవసరమైన మొత్తం బ్యాలెన్స్ లేకపోతే బ్లాక్‌లిస్ట్‌లోకి మారుతుంది. టోల్ వద్దకు వచ్చే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్టాగ్ ఇన్-యాక్టివ్‌లో ఉంటే లావాదేవీ జరగదు. అంతేకాకుండా స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్-యాక్టివ్‌లోకి మారినా లావాదేవీ జరగదు. ఇలాంటి సందర్భాల్లో పెనాల్టీ రూపంలో రెట్టింపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు కేవైసీ వెరిఫికేషన్ చేయకపోవడం, వాహన నంబర్‌కు, ఛాసిస్ నంబర్‌కు పొంతన లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో వెళ్తుంది. చివరి నిమిషంలో ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేసే అలవాటు ఉన్న వారు ఈ నిబంధనలను తెలుసుకోవడం మంచిది. 

Tags:    

Similar News