RIL: ప్రభుత్వ ఖజానాకు రూ.1.86 లక్షల కోట్లు అందించిన రిలయన్స్
రూ. 10 లక్షల కోట్ల ఆదాయం సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ తాజాగా తన వార్షిక నివేదికను విడుదల చేసింది. 'రిలయన్స్ ఫర్ ఆల్ ' పేరుతో విడుదల చేసిన నివేదికలో సంస్థ ఆర్థిక పనితీరు, ఆర్థికవ్యవస్థకు అందిస్తున్న సహకారం, సామాజిక బాధ్యత సహా పలు అంశాలను ప్రస్తావించింది. మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 20 లక్షల కోట్లను అధిగమించడమే కాకుండా రూ. 10 లక్షల కోట్ల ఆదాయం సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 20.1 లక్షల కోట్లు, ఏటా రూ. 79,020 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిలయన్స్ సంస్థ భారత ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో సహకారం అందిస్తోంది. వివిధ రకాల పన్నులు, సుంకాల ద్వారా భారత ఖజానాకు రూ. 1,86,440 కోట్లను చెల్లించింది. ఈ మొత్తం ఇటీవల సమర్పించిన 2024-25 కేంద్ర బడ్జెట్ వ్యయంలో సుమారు 3.86 శాతం నిధులకు సమానం కావడం గమనార్హం. ఇక, గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సామాజిక కార్యకలాపాలపై రూ. 1,592 కోట్లను ఖర్చు చేసింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 25 శాతం పెరిగింది. గత మూడేళ్లలో రిలయన్స్ సంస్థ సామాజిక వ్యయం రూ. 4,000 కోట్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వేతనాలు, ఇతర ఉద్యోగుల ఖర్చుల కోసం రూ. 25,679 కోట్లను వినియోగించింది.