క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు.. అందుబాటులోకి నయా ఫీచర్

ఏటీఎంలలో కార్డ్‌లెస్ నగదు లావాదేవీల దిశగా బ్యాంకులు అడుగులు

Update: 2023-09-07 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కార్డ్‌లెస్, క్యాషె‌లెస్ నగదు లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏటీఎంలలో కార్డ్‌లెస్ నగదు లావాదేవీల దిశగా బ్యాంకులు, పిన్‌టెక్ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. కార్డులు అవసరం లేకుండా నగదును విత్ డ్రా చేసుకునేలా ఏటీఎంలలో కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. దీని వల్ల మీ దగ్గర డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకపోయినా మొబైల్ ఓటీపీ లేదా, యాప్స్ ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని తీసకొస్తున్నాయి. ఇందుకోసం యూపీఐ ఏటీఎంలను తీసుకొస్తున్నారు. తాజాగా ముంబైలో తొలి యూపీఐ ఏటీఎం ప్రవేశపెట్టారు. జపాన్‌కు చెందిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అనే సంస్థ హిటాచీ మనీస్పాట్ ఏటీఎం పేరిట దీనిని ఆవిష్కరించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ ఏటీఎంను రూపొందించగా.. సెప్టెంబర్ 5న ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ సమావేశంలో దీనిని ఆవిష్కరించింది.

ప్రస్తుతం ముంబైలో ఈ యూపీఐ ఏటీఎంను అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌లోని యూపీఐ యాప్‌ ద్వారా స్కాన్ చేయాలి. అనంతరం యూపీఐ పిన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. ఈ విధానం ద్వారా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. దీని వల్ల డెబిట్ కార్డు మోసాలు తగ్గుతున్నాయి. చాలామంది బ్యాంకు ఖాతాదారులకు చెందిన కార్డులను క్లోనింగ్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి తరహా మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్ల వల్ల సైబర్ నేరగాళ్ల మోసాలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా బ్యాంకు ఖాతాదారులు ఈజీగా, అత్యంత వేగవతంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Tags:    

Similar News