సరికొత్త బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్‌ను విడుదల చేసిన మహీంద్రా!
దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త బొలెరో మ్యాక్స్ పిక్-అప్ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త బొలెరో మ్యాక్స్ పిక్-అప్ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది. రూ. 7.85 లక్షల(ఎక్స్‌షోరూమ్) ధరతో ప్రారంభమయ్యే ఈ వాహనం 1.3 టన్నుల నుంచి 2 టన్నుల వరకు లోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఇది డీజిల్, సీఎన్‌జీ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ వాహనం స్మార్ట్ ఇంజనీరింగ్ ద్వారా రూపొందించబడింది. ఎం2డీఐ ఇంజిన్ సుపీరియర్ పవర్, టార్క్ ద్వారా భారీ లోడ్‌ను సైతం సులభంగా మోయగలదు. అంతేకాకుండా మెరుగైన మైలేజ్, పనితీరు, భద్రత ఇందులో అందించినట్టు కంపెనీ వివరించింది. బొలెరో మ్యాక్స్ పిక్-అప్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించామని, అధిక మైలేజ్, అధిక పేలోడ్ సామర్థ్యం అందిస్తుందని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ నక్రా తెలిపారు.
ఆల్-న్యూ బొలెరో మ్యాక్ హెచ్‌డీ, సిటీ వంటి రెండు సిరీస్‌లలో లభిస్తుందన్నారు. కంపెనీ బొలేరో పిక్-అప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన 2000 ఏడాది నుంచి ఇప్పటివరకు 20 లక్షల కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించిందని ఆయన పేర్కొన్నారు.