కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫ్రాంక్స్' కారును విడుదల చేసిన మారుతీ సుజుకి!
దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ఫ్రాంక్స్ కారును సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ఫ్రాంక్స్ కారును సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.7.46 నుంచి రూ. 13.13 లక్షల మధ్య అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫ్రాంక్స్ దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ నెక్సా అవుట్‌లెట్‌లలో విక్రయించబడుతుందని వెల్లడించింది. గత కొన్ని నెలలుగా దేశంలో ఎస్‌యూవీ మోడల్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సరసమైన కార్లతో సగానికి పైగా మార్కెట్ వాటా కలిగిన మారుతీ సుజుకి ఎస్‌యూవీ విభాగంలో వెనకబడకుండా పోర్ట్‌ఫోలియోను పెంచుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఫ్రాంక్స్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మారుతీ సుజుకి ఎండీ, సీఈఓ హిసాషి టెకుచి మాట్లాడుతూ, వినియోగదారుల విభిన్న అవసరాలు, పరిశ్రమలో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఎస్‌యూవీ కాంపాక్ట్ విభాగంలో బ్రెజాకు మంచి ఆదరణ ఉంది. దాన్ని మరింత పెంచేందుకు ఫ్రాంక్స్ మోడల్‌ను తీసుకొచ్చామని' చెప్పారు. మొత్తం ఏడు రంగుల్లో ఎస్‌యూవీ ఫ్రాంక్స్ కారు లభిస్తుంది. భద్రతా పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, 3-పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్‌లు, చైల్డ్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, 360 వ్యూ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోహ్ ఛార్జర్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లేతో సహా అనేక హై-ఎండ్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫ్రాంక్స్ మోడల్ లీటర్‌కు 22.89 కిలోమీటర్ల మైలేజీ ఫ్రాంక్స్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.