ఈ ఏడాది 30 శాతం పెరగనున్న సీఎన్‌జీ అమ్మకాలు
మొత్తం సీఎన్‌జీ వాహనాల సంఖ్య 6 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తోంది. దాంతో మొత్తం సీఎన్‌జీ వాహనాల సంఖ్య 6 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా 2024-25లో కంపెనీ దాదాపు 3 లక్షల యూనిట్లను ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉంది. దీనికోసం గతేడాది ప్యాసింజర్ వాహనాల్లో సుమారు 4.50 లక్షల సీఎన్‌జీ కార్లను తయారు చేశాము. ఈసారి 6 లక్షల మార్కును దాటాలని ఆశిస్తున్నాం. హర్యానాలోని మానేసర్ ప్లాంటులో కంపెనీ సామర్థ్యాన్ని ఏడాదికి లక్షల యూనిట్లకు పెంచడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతీ చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఎర్టిగా సీఎన్‌జీ కార్లకు డిమాండ్ అత్యధికంగా ఉండటం వల్ల సరఫరా సమస్యలు తలెత్తాయని, దాన్ని అధిగమించేందుకే మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి పెంచుతున్నట్టు రాహుల్ వెల్లడించారు. కాగా, మారుతీ సుజుకి 2030-31 నాటికి ఏటా 40 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న దానికి రెట్టింపు కావడం గమనార్హం.