వచ్చే మూడేళ్లలో భారత్‌లో లులు గ్రూప్ రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు!
యూఏఈకి చెందిన రిటైల్ సంస్థ లులు గ్రూప్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది.
న్యూఢిల్లీ: యూఏఈకి చెందిన రిటైల్ సంస్థ లులు గ్రూప్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇటీవలే తమిళనాడులో తన షాపింగ్ మాల్ ప్రారంభించిన సంస్థ వచ్చే మూడేళ్లలో దేశంలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే లులు గ్రూప్ భారత్‌లో షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సహా వివిధ విభాగాల్లో రూ. 20,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.
అదనంగా మరిన్ని పెట్టుబడులు పెట్టి దేశంలో 50 వేల మందికి ఉపాధి కల్పించడం తమ లక్ష్యమని, ఇప్పటివరకు వివిధ విభాగాల్లో 22 వేల ఉద్యోగాలు కల్పించినట్టు లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ సోమవారం ప్రకటనలో తెలిపారు. రాబోయే ఐదేళ్లకు తెలంగాణలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు కట్టుబడి ఉంది.
రానున్న రోజుల్లో నోయిడాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, తెలంగాణలో మరొకటి ఏర్పాటు చేసేందుకు మూడేళ్లలో రూ. 10 వేల కోట్లు పెటనున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో నిర్మించిన కొత్త లులు మాల్‌ను ఈ ఆగష్టులో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.