Karnataka reservation bill: స్థానికంగా నైపుణ్యాలు పెంపొందించడంపై దృష్టి పెట్టాలి: HR నిపుణులు
ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపగా, దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపగా, దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పరిశ్రమ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో బిల్లును తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ బిల్లుపై HR నిపుణులు తాజాగా స్పందించారు, స్థానికంగా ఉండే వారికి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టడం ద్వారా ఉత్పాదకత మరింత పెరుగుతుందని, అందుబాటులో ఉన్న అవకాశాలు, ఉపాధికి అవసరమైన నైపుణ్యాల మధ్య అంతరాన్ని పరిష్కరించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఇలాంటి బిల్లు ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు.
టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ CEO AR రమేష్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ద్వారా భారతదేశ ఐటీ విప్లవానికి కేంద్రబిందువుగా, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌పై ఆధారపడిన జాతీయ, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలను కలిగి ఉన్నటువంటి కర్ణాటకలో పరిశ్రమల అభివృద్ధి చాలా వరకు క్షీణిస్తోందని, ముఖ్యంగా ఐటీ సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. మరో కంపెనీ ఎండీ, సీఈఓ మాట్లాడుతూ,ఈ బిల్లును ఆమోదించినట్లయితే, కంపెనీలు రిక్రూట్‌మెంట్ కోసం అంతర్గతంగా అభ్యర్థుల నివాసాలను ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద సంక్లిష్టతలను పెంచుతుందని చెప్పారు. దీంతో వ్యాపార అనుకూల రాష్ట్రాలకు కంపెనీలను మార్చడానికి ప్రేరేపించవచ్చు అని ఆయన అన్నారు.
HR సంస్థ మార్చింగ్ షీప్ వ్యవస్థాపకురాలు సోనికా అరోన్ మాట్లాడుతూ, కొత్త నిబంధనల వలన కంపెనీలు తమకు అవసరమైన ఖచ్చితమైన అర్హతలు, అనుభవం కలిగిన అభ్యర్థులను స్థానికంగా కనుగొనడం చాలా కష్టమని చెప్పారు. మరోవైపు ఇటీవల నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసింది, ఇది వ్యాపారాలను ఇతర ప్రాంతాలను తరలించడానికి బలవంతం చేస్తుందని పేర్కొంది. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ కూడా ముసాయిదా బిల్లును తప్పుబట్టారు.