2024లో రూ. 75 వేల కోట్ల ఐపీఓలు రానున్నాయ్
గతేడాది ఐపీఓల ద్వారా కంపెనీలు రూ. 49,434 కోట్లను సమీకరించాయి. 2024లో ఏకంగా రూ. 75,000 కోట్ల వరకు సేకరించవచ్చని అంచనా
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. గతేడాది ఐపీఓకు వచ్చిన చాలా కంపెనీలు విజయవంతంగా నిధులను సేకరించాయి. పెట్టుబడిదారులు సైతం కొత్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో 2024లోనూ ఈ ధోరణి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఏఈబీఐ వార్షిక కన్వెన్షన్ కార్యక్రమంలో ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా మాట్లాడుతూ, గతేడాది ఐపీఓల ద్వారా కంపెనీలు రూ. 49,434 కోట్లను సమీకరించాయి. 2024లో రూ. 75,000 కోట్ల వరకు సేకరించవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 'ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ప్రైమరీ మార్కెట్లతో పాటు సెకండరీ మార్కెట్లలోనూ మదుపర్లకు సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలోనే పరిస్థితులు కొనసాగితే ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్లలో ఐపీఓల కోలాహలం కనిపిస్తుంది. ఎన్నికల ముందు మాత్రం కంపెనీలు ఐపీఓలకు దూరంగా ఉండవచ్చని' హల్దియా అభిప్రాయపడ్డారు. డిసెంబర్‌లో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో అధికార బీజేపీ మూడింటిని కైవసం చేసుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ మోడీనే అధికారంలోకి వస్తారనే అంచనాలతో బ్యాంకులు, పారిశ్రామిక, విద్యుత్, స్థిరాస్తి వంటి రంగాల్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది.
అలాగే, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటీ లిమిటెడ్(ఎన్ఎస్‌డీఎల్) ఈ ఏడాది మార్కెట్లలోకి అడుగుపెడుతుందని ప్రణవ్ హల్దియా భావిస్తున్నారు. దేశంలోనే పురాతన డిపాజిటరీ సేవల సంస్థ అయిన ఎన్ఎస్‌డీఎల్ రూ. 3,000 కోట్లను సేకరించే అవకాశం ఉంది. ఇదికాకుండా కొత్త యుగం టెక్నాలజీ కంపెనీలు, తయారీ సంస్థలు ఐపీఓకు సిద్ధమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 2024లో ఎక్కువగా పెద్ద సంస్థలు మార్కెట్లలోకి రానుండటంతో ఐపీఓల ద్వారా సేకరించే మొత్తం పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం, ఓయో, డిజిట్ ఇన్సూరెన్స్, ఫస్ట్‌క్రై మూడు కంపెనీలు దాదాపు రూ. 16,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నాయి. మొత్తంగా 27 కంపెనీలు రూ. 28,500 కోట్ల వరకు సేకరించేందుకు సెబీ నుంచి అనుమతి పొందగా, మరో 36 కంపెనీలు రూ. 40,500 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి కోసం వేచి ఉన్నాయి.