NSE: ఆసియాలోనే అత్యధిక ఐపీఓలతో ఎన్ఎస్ఈ రికార్డు

ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, 2024లో మొత్తం 268 కంపెనీల పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి.

Update: 2025-01-03 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ ఎక్స్ఛేంజీ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్ఎస్ఈ) కొత్త రికార్డులను నమోదు చేసింది. ఆసియాలోనే అత్యధిక ఐపీఓలతో పాటు భారీ మొత్తంలో నిధులను సమీకరించింది. పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులతో అత్యధిక ఈక్విటీ మూలధనాన్ని సేకరించి ప్రపంచ రికార్డును సాధించింది. 2024లో భారత ఈక్విటీల్లో ఐపీఓ సందడి పెరిగిన సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు మార్కెట్ల ర్యాలీని ఉపయోగించుకున్నాయి. తాజా ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, 2024లో మొత్తం 268 కంపెనీల పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. వాటిలో 90 కంపెనీలు మెయిన్‌బోర్డ్ విభాగానికి చెందినవి, 178 ఎస్ఎంఈ విభాగంలో లిస్టింగ్ అయ్యాయి. ఇవి ఒక కేలెండర్ ఏడాదిలోనే అత్యధిక ఐపీఓలు కావడం విశేషం. ఈ ఐపీఓల నుంచి కంపెనీలు మొత్తం రూ. 1.67 లక్షల కోట్లను సమీకరించాయి. ఆసియా ప్రాంతంలో ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో నాలుగో వంతు భారత్ నుంచే కావడం గమనార్హం. భారత్ తర్వాత చైనా(101), జపాన్(93), హాంకాంగ్(66) ఉన్నాయి. సేకరించిన నిధుల పరంగా కూడా భారత్ అగ్రస్థానంలోనే ఉంది. అమెరికాకు చెందిన నాస్‌డాక్, ఎన్‌వైఎస్ఈ), హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్, చైనాకు చెందిన షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా ఐతిపెద్ద ఐపీఓగా హ్యుండాయ్ మోటార్ ఇండియా నిలిచింది. 

Tags:    

Similar News