ఏడాదిలో 1,120 విమానాలు ఆర్డర్ చేసిన భారత ఎయిర్‌లైన్ సంస్థలు

వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లో ఉనికిని విస్తరిస్తున్న ఎయిర్‌లైన్ సంస్థలు విమానాలను ఆర్డర్ చేశాయి.

Update: 2024-01-18 10:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో విమానాలు ఎక్కే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొంత ఖరీదైనప్పటికీ తక్కువ సమయంలో ప్రయాణంతో పాటు ఇతర కారణాలతో విమానాల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో రద్దీని తగ్గించేందుకు భారత విమానయాన సంస్థలు కొత్త ఫ్లయిట్లను కొంటున్నాయి. తాజాగా భారత కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ గురువారం 150 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. ఇదికాకుండా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లో తమ ఉనికిని విస్తరిస్తున్న మూడు భారత ఎయిర్‌లైన్ సంస్థలు కూడా గడిచిన ఏడాదిలోపు 1,120 విమానాలను ఆర్డర్ చేశాయి. గతేడాది ఫిబ్రవరిలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ఇండియా 470 విమానాలను ఆర్డర్ చేసింది. అందులో 250 ఎయిర్‌బస్, 220 విమానాల కోసం బోయింగ్‌తో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత జూన్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 500 నారో బాడీ విమానాలను కొనేందుకు ఎయిర్‌బస్‌తో ఒప్పందం చేసుకుంది. 2023లో దేశీయ ఎయిర్ ట్రాఫిక్ కొత్త గరిష్ఠాలకు పెరగడంతో ఎయిర్ఇండియా, ఇండిగో కలిసి 970 విమానాలను ఆర్డర్ చేశాయి. ఇప్పుడు ఆకాశ ఎయిర్ కొత్త విమానాలను కొనడం ద్వారా 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 1,120 విమానాల కోసం దేశీయ ఎయిర్‌లైన్ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఇవికాకుండా ఇంతకుముందు ఇండిగో మాత్రమే దాదాపు 1,000 విమానాల కోసం ఆర్డర్ చేసింది. గతేడాది మే నుంచి విమాన సర్వీలను నిలిపేసిన గోఫస్ట్ 72 విమానాలు ఆర్డర్ చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో దేశీయ ఎయిర్‌లైన్ సంస్థలు 1,600 కంటే ఎక్కువ విమానాలను డెలివరీ తీసుకోనున్నాయి. ప్రస్తుతం భారత విమానయాన రంగంలో 730 విమానాలున్నాయి. ఇటీవలే పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా మాట్లాడుతూ, 2030 నాటికి భారత విమానాల సంఖ్య 1,500 నుంచి 2,000కి చేరుకుంటుందని చెప్పారు.

Tags:    

Similar News