Indian Economy: 2028 నాటికి ట్రిలియన్ డాలర్లకు భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ
మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు పెరుగుతుండటం, చౌకైన 4జీ, 5జీ సేవలు ఇందుకు దోహదపడనున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2028 నాటికి ట్రిలియన్ డాలర్ల(రూ. 83.97 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని ఓ నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో డిజిటల్ విభాగంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలతో దేశ ఆర్థికవ్యవస్థలో గణనీయమైన మార్పులు జరిగాయని ప్రముఖ ఆస్క్ కేపిటల్ తన నివేదిక తెలిపింది. మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు పెరుగుతుండటం, చౌకైన 4జీ, 5జీ సేవలతో పాటు డిజిటల్ కార్యక్రమాలు ఇందుకు దోహదపడనున్నాయి. ప్రధానంగా యూపీఐ లాంటి స్వదేశీ టెక్నాలజీ ఆవిష్కరణలతో భారత్ ఎక్కువ ప్రయోజనాలను పొందుతోంది. ఇది మొత్తం భారత డిజిటల్ ఆర్థిక అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌లా ఉంది. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ల వాడకంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు అత్యధికంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వంటి పథకాలు దేశ డిజిటల్ ఆర్థికవ్యవస్థకు ఎక్కువ మద్దతిస్తున్నాయి. అలాగే, పెరిగిన మొబైల్, బ్రాండ్‌బ్యాండ్ విస్తరణ కూడా కొత్త డిజిటల్ సేవలను పెంచుతున్నాయి. సరసమైన డేటా, పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య, ఈ-కామర్స్‌లో వృద్ధి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక పేర్కొంది.