636 బిలియన్ డాలర్లకు భారత ఫారెక్స్ నిల్వలు
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు(ఫారెక్స్) మార్చి 8తో ముగిసిన వారానికి 10.47 బిలియన్ డాలర్లు పెరిగి 636.095 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన డేటా పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు(ఫారెక్స్) మార్చి 8తో ముగిసిన వారానికి 10.47 బిలియన్ డాలర్లు పెరిగి 636.095 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన డేటా పేర్కొంది. అంతకుముందు వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.626 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతంలో ఇది అక్టోబర్ 2021లో 645 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది.
మార్చి 8తో ముగిసిన వారానికి, రిజర్వుల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 8.121 బిలియన్ డాలర్లు పెరిగి 562.352 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. సమీక్ష వారంలో బంగారం నిల్వలు 2.299 బిలియన్ డాలర్లు పెరిగి 50.716 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 31 మిలియన్ డాలర్లు పెరిగి 18.211 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు అపెక్స్ బ్యాంకు పేర్కొంది. రిపోర్టింగ్ వారంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో భారత రిజర్వ్ స్థానం 19 మిలియన్ డాలర్లు పెరిగి 4.817 బిలియన్ డాలర్లకు చేరుకుంది.