ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి భారత ఫారెక్స్ నిల్వలు
భారత విదేశీ మారక ద్రవ్య(ఫారెక్స్) నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి
దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారక ద్రవ్య(ఫారెక్స్) నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం, మార్చి 29 తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు $2.951 బిలియన్లు పెరిగి $645.583 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ నిల్వలు పెరగడం ఇది వరుసగా ఆరో వారం. గత రిపోర్టింగ్ వారంలో నిల్వలు $140 మిలియన్లు పెరిగి $642.631 బిలియన్లుగా నమోదయ్యాయి. గతంలో 2021 సెప్టెంబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి $642.453 బిలియన్లకు చేరుకోగా, ప్రస్తుతం సమీక్ష వారంలో నిల్వలు ఈ రికార్డును దాటి $645.583 బిలియన్లకు చేరుకోవడం గమనార్హం.
అలాగే మార్చి 29తో ముగిసిన కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $2.354 బిలియన్లు పెరిగి $570.618 బిలియన్లకు చేరాయని డేటా వెల్లడించింది. అదే సమయంలో బంగారం నిల్వలు $673 మిలియన్లు పెరిగి $52.16 బిలియన్లుగా నమోదయ్యాయి. ప్రత్యేక డ్రాయిండ్ హక్కులు $73 మిలియన్లు తగ్గి $18.145 బిలియన్లకు చేరుకున్నాయని అపెక్స్ బ్యాంక్ తెలిపింది.రిపోర్టింగ్ వారంలో IMFలో భారతదేశ రిజర్వ్ స్థానం $2 మిలియన్లు తగ్గి $4.66 బిలియన్లకు చేరుకుంది.