Malware Attacks: మొబైల్ మాల్వేర్ దాడులకు ప్రధాన టార్గెట్‌గా భారత్
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జరిగే మొబైల్ మాల్వేర్ దాడుల్లో 66.5 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: మొబైల్ మాల్వేర్ దాడులకు ఆవాసంగా భారత్ నిలుస్తోందని, అమెరికా, కెనడాల కంటే అత్యధికంగా మొబైల్ మాల్వేర్ దాడులు దేశంలో జరుగుతున్నాయని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొబైల్ మాల్వేర్ దాడుల్లో భారత్‌లో ఒక్కటే 28 శాతం జరుగుతున్నాయి. ఇది అమెరికా(27.3 శాతం), కెనడా(15.9 శాతం) కంటే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా గతేడాది మూడోస్థానం నుంచి భారత ర్యాంక్ మరింత పెరిగింది. వేగంగా వృద్ధి చెందూతున్న డిజిటలైజేషన్, సైబర్ బెదిరింపుల నేపథ్యంలో దేశీయంగా కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌లను మరింత భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జరిగే మొబైల్ మాల్వేర్ దాడుల్లో 66.5 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. భారత్‌లో ముఖ్యంగా ప్రధాన ఐదు ప్రైవేట్ బ్యాంకుల్లో మూడింటికి చెందిన మొబైల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మాల్వేర్ దాడులు జరుగుతున్నాయి. లాగ్-ఇన్, బ్యాంకింగ్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలించి వినియోగదారులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లను వాడుతున్నారని నివేదిక పేర్కొంది.