GDP: జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 6 శాతం: ఇక్రా

భారత జీడీపీ వృద్ధి జూన్‌ 30తో ముగిసిన మూడు నెలల్లో 6 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గురువారం అంచనా వేసింది

Update: 2024-08-22 09:13 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత జీడీపీ వృద్ధి జూన్‌ 30తో ముగిసిన మూడు నెలల్లో 6 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గురువారం అంచనా వేసింది. ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గడం, పట్టణ వినియోగదారుల విశ్వాసం కారణంగా ఈ అంచనాకు వచ్చినట్టు ఏజెన్సీ పేర్కొంది. మార్చి 31, 2024తో ముగిసిన మూడు నెలల కాలంలో భారత జీడీపీ 7.8 శాతంగా నమోదైంది. ఇక్రా, భారత స్థూల విలువ జోడింపు (GVA) వృద్ధిని జూన్ త్రైమాసికంలో 5.7 శాతంగా అంచనా వేయగా, ఇది మార్చి కాలంలో 6.3 శాతం నుంచి తగ్గడం గమనార్హం.

పారిశ్రామిక రంగ వృద్ధి ఎఫ్‌వై24లో నాలుగో త్రైమాసికంలో 8.4 శాతం నుండి ఎఫ్‌వై25 మొదటి త్రైమాసికంలో 6.4 శాతానికి తగ్గుతుందని అంచనా. సేవల రంగం విస్తరణ కూడా మునుపటి త్రైమాసికంలో 6.7 నుంచి 6.5 శాతానికి తగ్గుతుందని ఇక్రా తెలిపింది. అయితే రుతుపవనాలు సానుకూలంగా ఉండటం కారణంగా వ్యవసాయ రంగ వృద్ధిపై మాత్రం అంచనాలను పెంచింది.

వ్యవసాయ వృద్ధి మునుపటి త్రైమాసికంలో 0.6 శాతం నుండి 1 శాతానికి స్వల్పంగా పుంజుకోవచ్చని ఇక్రా పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఎన్నికల కారణంగా కొన్ని రంగాల్లో వృద్ధి మందగించింది. కమోడిటీ ధరల కారణంగా తక్కువ వాల్యూమ్ వృద్ధి కొన్ని పారిశ్రామిక రంగాల లాభదాయకతపై ప్రభావం చూపింది. వేడి వాతావరణం విద్యుత్ డిమాండ్‌ను పెంచి కొన్ని సేవా రంగాలపై ప్రభావాన్ని చూపిందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు.

Tags:    

Similar News