వరదలో మునిగిన వాహనాలకు.. ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది..?

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో.. వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.

Update: 2024-09-04 20:08 GMT
వరదలో మునిగిన వాహనాలకు.. ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది..?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం నగరాల్లో భారీగా నష్టం వాటిల్లింది. అకస్మాత్తుగా ముంచెత్తిన వరదనీటిలో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ వరదలోనే వాహనాలు నీటిలో మునిగి పాడైపోయాయి(Damage). అయితే, ఇలా వరదలు వచ్చినప్పుడల్లా కార్లు, బైకులు సహా.. పలు రకాల వాహనాలు కొట్టుకుపోవడం, దెబ్బతినడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో.. దెబ్బతిన్న వాహనాలకు, ముఖ్యంగా కార్లు(Cars) లాంటి వాహనాలకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా? బీమా డబ్బు ఎంత వస్తుంది? వంటి అనేక సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అలాంటి వివరాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

కారు ఇన్సూరెన్స్ కవరేజీని ఎలా పొందాలి..?

వరదల్లో దెబ్బతిన్న కార్లకు ఇన్సూరెన్స్ ఎలా పొందాలో.. హ్యుందాయ్ ఇన్సూరెన్స్ డివిజనల్ ఆఫీసర్ 'మోనీయేల్' వివరించారు. కొత్త కార్లకు చేసిన ఇన్సూరెన్స్ విలువ ఆధారంగా మరమ్మతులు, పాత విడిభాగాల స్థానంలో కొత్తవి వేయడం చేస్తారని, ఇది ప్రతి కారుకు తరుగుదల (Depreciation) ఆధారంగా నిర్ణయించిన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ(Insured declared value) ప్రకారం చేస్తారని తెలిపారు. వరదలో మునిగిన కారు ఇంజిన్ ఆన్ చేస్తే అందులోకి నీరు చేరి ఉంటుంది. మీ ఇన్సూరెన్స్ పాలసీకి ఇంజిన్ ప్రొటెక్షన్ ఆప్షన్ జత చేసి ఉంటే, మీరు దానిని క్లెయిమ్(Claim) చేయవచ్చు. దీంతోపాటు మీ కారు వరదలో చిక్కుకోగానే మీరు కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను గానీ, ఇన్సూరెన్స్ ఆఫీసును కానీ వెంటనే సంప్రదించాలి. ఇందుకోసం ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ తమ వెబ్‌సైట్‌లో టోల్ ఫ్రీ నంబరు ఇస్తుంది.కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వినియోగదారుల నుంచి సమాచారం సేకరించేందుకు.. నగరంలో క్యాంపులు నిర్వహించి , వెంటనే సర్వేయర్ దగ్గరకు వెళ్ళవలసిందిగా సూచిస్తాయి. మరికొన్ని కంపెనీలు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వినియోగదారులకు సందేశాలు పంపుతాయి. టోల్ ఫ్రీ నంబరులో మీ సమస్య చెప్పుకోవడానికి అవకాశం లభించకపోతే, మీరు వెంటనే ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ఇన్సూరెన్స్ పొందడానికి సమాచారం ఇవ్వడమనేది అత్యంత ప్రాథమిక విషయం. కారుకు జరిగిన నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేసేటప్పుడు కారు ముందు భాగం, వెనుక భాగం, లోపలి భాగాలను ఫోటోలను తీసి.. వాటిని ఈ-మెయిల్‌కు(Email) పంపాలి. అయితే, ఇన్సూరెన్స్ పొందడానికి ఈ ఫోటోలు చాలా అవసరం. మీ వాహన రిజిస్ట్రేషన్ నంబరు కూడా ఈ ఫోటోలలో స్పష్టంగా కనిపించాలి.ఇలా మీరు ఇన్సూరెన్స్ కోరుతూ ఈ-మెయిల్ పంపాక.. కంపెనీ మీకొక ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ నంబరు పంపుతుంది. ఈ నంబరుతో మీ ఇన్సూరెన్స్ స్థితిగతులను తెలుసుకోవచ్చు.

దెబ్బతిన్న వాహనాల నష్టాన్ని లెక్కించడం ఎలా..?

వరదల్లో డ్యామేజ్ అయిన కార్లను.. ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు రిపేర్ షాపుకు తరలిస్తారు. కారు తరలింపు, రికవరీ వంటివి ఇన్సూరెన్స్‌లో పొందుపరచి ఉండాలి. అందుకే మీరు కారు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేటప్పుడు ఒక్కసారి ఈ అంశాలను చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కోసం సంబంధిత దరఖాస్తును నింపడంతోపాటు డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, పర్మిట్ కాపీలను కంపెనీకి అందించాలి. ఒకవేళ ఈ సర్టిఫికెట్స్ పోతే.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు కంపెనీకి కూడా తెలియజేయాలి. అయితే, సంబంధిత డాక్యుమెంట్లను కంపెనీ కూడా సంపాదిస్తుందని మోనియేల్ తెలిపారు. దీంతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీ.. కారును విలువ కట్టేందుకు ఇన్సూరెన్స్ ఆఫీసర్(సర్వేయర్‌)ను పంపుతుంది. మీ కారు ఎంత నష్టపోయిందో లెక్కించడానికి వీరు సహాయపడతారు. మీ కారు ఎంతవరకు దెబ్బతిన్నది, దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలు సర్వేయర్ నిర్ధారిస్తారు. వీటి లెక్కింపు పూర్తయ్యాక, మీరు పొందే ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంపెనీ సంక్షిప్త సందేశాల ద్వారా పంపుతుంది. లేదంటే మీరు టోల్ ఫ్రీ నంబరు ద్వారా కంపెనీని సంప్రదించవచ్చు.

ఇన్సూరెన్స్ ఎంత మొత్తం వస్తుంది..?

మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏయే షరతులకు అంగీకరించారు అనే దాన్ని బట్టే.. మీ కారులో దెబ్బతిన్న భాగాలకు ఇన్సూరెన్స్ వస్తుందని మోనీయేల్ తెలిపారు. ఇన్సూరెన్స్ పరిధిలో లేని దెబ్బతిన్న భాగాలకు కూడా ఎంత ఖర్చు అవుతుందో లెక్కగట్టి చెబుతారు. దీనికి మీరు అంగీకరిస్తే మీ కారు మరమ్మతులు మొదలవుతాయి. ఒకవేళ మీ దగ్గర అంత డబ్బు లేకపోతే అవసరాన్ని బట్టి ముఖ్యమైన భాగాలు మరమ్మతు చేయించుకోవచ్చు. కారుకు సంబంధించిన రిపేర్లు అన్నీ పూర్తయ్యాక, ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా రిపేర్ చేసిన వారికే చెల్లిస్తుంది. మీరు కానీ పొరపాటున నీటిలో చిక్కుకున్న కారును ఆన్ చేస్తే, అందులో నీరు నిలిచిపోయి అది మరమ్మతులకు పనికి రాకుండా పోతుంది.కారు ప్రస్తుత స్థితిని పరిగణనలోకి తీసుకుని, కారును తుక్కుకు పంపడమో, లేదంటే ఇన్సూరెన్స్ విలువకు సమానంగా తుక్కు కింద పరిగణించడమో చేస్తారు.దీని తరువాత మీకెంత చెల్లిస్తారనే విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ తెలియజేస్తుంది.ఒకవేళ మీ కారు లోను(Loan) కింద లేదా కాంట్రాక్ట్‌(Contract) లో ఉన్నా ఇన్సూరెన్స్ మొత్తం అసలైన యజమానికే చెందుతుంది.

ఒకవేళ, మీ కారు వరద నీటిలో కొట్టుకుపోయి కనిపించకుండా పోతే.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్(FIR) పొందవలసి ఉంటుంది. ఇచ్చిన గడువులోపు పోలీసులు మీ కారును కనుక్కోలేకపోతే , మీ వాహనం మిస్ అయినట్టు పోలీసులు ఒక ధ్రువపత్రాన్ని ఇస్తారు. అప్పుడు మీరు మీ ఒరిజినల్ 'కీ'(key)తో పాటు, రవాణా శాఖలో నమోదుచేసిన సమాచారం, ఇతర డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన సమాచారమంతా సరైందే అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ.. చోరీకి గురైన కారుకు సంబంధించి ఐడీవీ(Insured Declared Value) ఆధారిత విలువ మేరకు మీకు డబ్బు చెల్లిస్తుంది. ఇట్టి పరిహారాన్ని కారు తయారైన సంవత్సరం, దానికి జరిగిన నష్టం ఆధారంగా నిర్ణయిస్తారు.

ఇన్సూరెన్స్‌ మొత్తం ఎన్ని రకాలు..?

వరదలకు దెబ్బతిన్న కార్ల విషయంలో.. మీ కారు విలువ ఐడీవీ(Insured Declared Value) కంటే ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ కారు మొత్తాన్ని నష్టంగా చెల్లిస్తుంది.

  • రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తరుగుదల రహిత(Depreciation free) ఇన్సూరెన్స్ అనేది వంద శాతం చెల్లిస్తారు. దీనిని 'బంపర్ టు బంపర్' అని పిలుస్తారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కారు యాక్సిడెంట్ ద్వారా ఎవరికైనా గాయాలైనా లేదా మరణించినా.. వైద్య ఖర్చులను, నష్ట పరిహారాన్ని కవర్ చేస్తుంది. సహజంగా కొత్త కారు కొన్నప్పుడు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ డీలర్లే.. మూడేళ్ళపాటు చెల్లిస్తారు.
  • బోల్టులు, నట్లు, వైర్లు, ఎలుకల వలన కలిగే నష్టాలను కూడా ఇన్సూరెన్స్‌లో కవర్ చేస్తారు.
  • ఇంజన్ రక్షణ అంటే, ఇంజన్‌లోకి నీరు చొచ్చుకుపోయి పనికిరాకుండా పోతే 100 శాతం కవర్ అయ్యేది.
  • కొత్తగా కొన్న కారు కనుక చోరీకి గురైనా, మంటల్లో చిక్కుకున్నా, ఎక్స్ షోరూమ్ ధర(రోడ్డు ట్యాక్స్ లు సహా) రిటర్న్ టు ఇన్వాయిస్(Return to invoice) అనే ఇన్సూరెన్స్ పథకం ద్వారా చెల్లిస్తారు.
  • కీ ప్రొటెక్షన్(Key protection) అనేది కీ పోగొట్టుకుంటే.. పోలీసు వారు ఇచ్చే సర్టిఫికేట్ సమర్పించాకా అందుబాటులో ఉండే ఇన్సూరెన్స్ అన్నమాట.
  • కారు ప్రమాదానికి గురైనా.. కారు లోపలి భాగాలు చోరీకి గురైనా.. పర్సనల్ బిల్లింగ్ ఇన్సూరెన్స్ కింద డబ్బు చెల్లిస్తారు.

మరి దెబ్బతిన్న కార్లను ఏం చేస్తారు..?

దెబ్బతిన్న కార్లను తుక్కు కింద, విడిభాగాల మార్కెట్‌లో అమ్మేస్తారు. లేదంటే బయటి నుంచి విడిభాగాలు కొనుక్కుని, ప్రైవేటు రిపేరు సెంటర్ లో బాగు చేసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తారు.

వరదల్లో దెబ్బతిన్న కార్లను సహజంగా నాలుగు భాగాలుగా వర్గీకరిస్తారని ఆటో ఇన్సూరెన్స్ రంగంలో పదేళ్ళ అనుభవం ఉన్న ఓ వ్యక్తి దీని గురించి వివరిస్తూ.. వరదల కారణంగా దెబ్బతిన్న కార్లను ఏ, బీ, సీ, డీ కేటగిరి లుగా వర్గీకరస్తారని అన్నారు. పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన కార్లను 'ఏ' కేటగిరీ కింద గుర్తిస్తారని, సీట్లు కూడా మునిగిన కార్లను 'బీ' కేటగిరీలోకి, సీటు వరకు మునిగిన కారును 'సీ' కేటగిరి కింద, కారు మ్యాట్ వరకు మునిగిన వాటిని 'డీ' కేటగిరీ కింద పరిగణిస్తారని అన్నారు. అయితే.. ఏ, బీ కేసులలోనే సాధారణంగా నీరు ఇంజన్‌లోకి చేరుతుంది. దీనిని పూర్తి నష్టంగా పరిగణిస్తారని ఆయన అన్నాడు. ఇటువంటి వాటికి Return to invoice(RTI) పాలసీ మంచిదని తెలిపాడు. ఆటో ఇన్సూరెన్స్ రంగంలో పదేళ్ళ అనుభవం ఉన్న సదరు వ్యక్తి తన స్నేహితుడి గురించి చెబుతూ.. ‘‘నా స్నేహితుడు బీఎండబ్ల్యూ లగ్జరీ కారు కొన్న ఏడాదికే వరదలో పూర్తిగా మునిగిపోయింది. అతను ఆర్టీఐ(RTI) ఇన్సూరెన్స్ తీసుకున్నాడు గనుక అతనికి కొత్త కారు ఇప్పించేందుకు కంపెనీ అంగీకరించింది’’ అని తెలిపాడు. మరికొన్ని కంపెనీలు అయితే ప్రస్తుత సంవత్సర ఎక్స్ షోరూమ్ ధరతో పాటు.. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తిరిగి చెల్లిస్తుంటాయి.

ఇతర విపత్తు బీమా(Disaster Insurance)ల గురించి..

ఆస్తి బీమా(Property Insurance) పేరుతో కూడా.. వివిధ రకాలైన ఆస్తి బీమా పాలసీలు తీసుకోవచ్చు. దీని కింద గృహాలు, గిడ్డంగులు, ఫ్యాక్టరీలు, వ్యవసాయం, ఫర్నీచర్, నగదు, బంగారం, రా మెటీరియల్స్, గిడ్డంగులలో నిల్వచేసిన వస్తువులకు కూడా బీమా తీసుకోవచ్చని.. 'ఇఫ్కో టోక్యో ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ మురళీరాజన్' చెప్పారు.

అలాగే భారీ వర్షాలు, వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. తిరిగి ఆస్తిని పొందడానికి ఆస్తి బీమా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఉదాహరణకు.. ఓ మధ్య తరగతి కుటుంబానికి 40 లక్షల విలువ చేసే ఇల్లు, ఇంట్లో 10 లక్షల విలువైన బంగారం, ఇతర గృహోపకరణాలు ఉంటే, ఏడాదికి 5 వేల రూపాయల ప్రీమియం చెల్లించేలా 50 లక్షల రూపాయలకు వీటిని బీమా చేయించవచ్చు అని మురళీ రాజన్ వివరించారు. కారు షోరూమ్ కంపెనీలు కూడా.. వరదల్లో తమ కొత్త కార్లు కొట్టుకుపోయి ఉంటే, నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. కోస్తా తీరంలో తరచుగా తుపాన్లు, వరదలు ఎక్కువగా సంభవిస్తుంటాయి కనుక, ఆస్తి బీమా వంటి పాలసీలు తీసుకుని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. కాగా, ప్రస్తుతం చాలా కంపెనీలు ఇలాంటి పాలసీలను అందిస్తున్నాయి.


Similar News