రూ.605 కోట్ల ట్యాక్స్ నోటీసులు అందుకున్న హీరో మోటోకార్ప్
దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఆరు అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.605 కోట్ల ట్యాక్స్ నోటీసులను పంపించింది. ఆర్థిక సంవత్సరం 2013-14 నుండి 2017-18, 2019-20 అసెస్‌మెంట్ ఏడాదికి వడ్డీతో సహ మొత్తం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అసలు పన్ను రూ. 308.65 కోట్లు దానికి వడ్డీ రూ. 296.22 కోట్లు. మొత్తం కలిపి రూ.605 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని హీరో మోటోకార్ప్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులను కంపెనీ పరిశీలిస్తోంది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీళ్లను దాఖలు చేస్తుంది. ఇది సంస్థ ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం లేదని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వారం ప్రారంభంలో, కంపెనీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో మొత్తం అమ్మకాలు 5.5% వృద్ధితో 56,21,455 యూనిట్లుగా నమోదైంది. 2022-23లో కంపెనీ 53,28,546 యూనిట్లను విక్రయించింది.