HCL Work from Home: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన HCL.. ఆఫీస్‌కు రాకపోతే లీవ్స్, జీతం కట్
కరోనా తర్వాత టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, కొంతమంది దీనికి అయిష్టత వ్యక్తం చేయడంతో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు
దిశ, బిజినెస్ బ్యూరో: కరోనా తర్వాత టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, కొంతమంది దీనికి అయిష్టత వ్యక్తం చేయడంతో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు. నెలలో కనీసం కొద్ది రోజులు అయిన ఆఫీస్ నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. అయితే ఈ ఆదేశాలను సైతం కొంత మంది ఉద్యోగులు పాటించడం లేదు. తాజాగా ఈ విషయంలో దేశీయ మూడో ఐటీ దిగ్గజ కంపెనీ HCL కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే, వాటిని లీవ్స్‌గా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ప్రస్తుత విధానం ప్రకారం, ఉద్యోగులు వారానికి మూడు రోజులు, నెలలో కనీసం 12 రోజులు ఆఫీసు నుండి పని చేయాలి. అయితే ఈ నిబంధనను కూడా కొంతమంది ఉద్యోగులు పాటించడం లేదని కంపెనీ గుర్తించింది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నిబంధన కంటే తక్కువ రోజులు ఆఫీసులకు వచ్చినట్లయితే రాని ప్రతి రోజును లీవ్స్‌గా పరిగణిస్తామని, ఒకవేళ ఉద్యోగి లీవ్స్ అయిపోతే, జీతం నుంచి రోజు ప్రాతిపదికన శాలరీ కటింగ్ చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
HR విభాగం ఈ అప్‌డేట్ గురించి తమ టీమ్‌లకు ఈమెయిల్ ద్వారా తెలియజేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం, HCLటెక్ కంపెనీ మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలం పాటు కంపెనీలో ఉన్న ఉద్యోగులకు 18 వార్షిక సెలవులు, అలాగే ఒక వ్యక్తిగత సెలవును అందిస్తుంది. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారికి 20 వార్షిక సెలవులు, రెండు వ్యక్తిగత సెలవులను అందిస్తుంది. ఉద్యోగుల కంపెనీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని పూర్తి స్థాయిలో పాటించకపోతే ఈ లీవ్స్‌ను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిన పరిస్థితి నెలకొంది.