మే 1 నుంచి వ్యాపార సంస్థలకు కొత్త జీఎస్టీ నిబంధన!
వ్యాపార సంస్థలకు ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ నిబంధన అమల్లోకి రానుంది.
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలకు ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ నిబంధన అమల్లోకి రానుంది. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను జారీ చేసిన వారం రోజుల్లోగా ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్(ఐఆర్‌పీ)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్‌వర్క్(జీఎస్‌టీఎన్) వెల్లడించింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాయి. రూ. 100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్‌లను అందించడంలో ఎలాంటి కాలపరిమితి లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం, ఐఆర్‌పీలో ఇన్న్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) పొందడానికి అనర్హులవుతారు.
ప్రస్తుతం రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలన్నీ బీ2బీ లావాదేవీలను ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ కలిగి ఉండటం తప్పనిసరి అని తెలిసిందే. ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ నిబంధనను జీఎస్టీ చట్టం 2020 అక్టోబర్ నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలు అమలు చేసింది. ఆ తర్వాత 2021, జనవరి నుంచి రూ. 100 కోట్ల సంస్థలకు, 2021, ఏప్రిల్ నుంచి రూ. 50 కోట్ల సంస్థలకు, 2022, ఏప్రిల్ నుంచి రూ. 20 కోట్ల సంస్థలకు, గతేడాది అక్టోబర్ నుంచి రూ. 10 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు దీన్ని అమలు చేసింది.
Also Read...