RBI ULI: బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్

బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్బీఐ గవర్నర్ తీపి కబురు చెప్పారు.

Update: 2024-08-26 10:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఐ విధానం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆర్బీఐ.. త్వరలో బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు పొందేలా కొత్త తరహా సేవలను అందుబాటులోకీ తీసుకురాబోతున్నది. ఈ మేరకు త్వరలోనే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేస్ (యూఎల్ఐ) ని జాతీయ స్థాయిలో లాంచ్ చేయబోతున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం వెల్లడించారు. బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన 'ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ ' విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో ఈ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు ఆర్బీఐ సిద్ధం అవుతున్నదని వెల్లడించారు.

వ్యక్తుల భూమి వివరాలు, ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యూఎల్ఐ పని చేస్తుందని దీని వల్ల రుణాలు పొందేందుకు అవసరమైన అప్రూవర్ ప్రక్రియ సులభం, వేగవంతం కానున్నట్లు చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రుణాల జారీలో వేగం పెరుగుతుందని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక మంది రుణాలు తీసుకుని కట్టుకునే అవకాశాలు ఉన్నా ఆమోదం లభించకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొందుతున్నారు. ఈ విధానం గనుక అమల్లోకి వస్తే డిజిటల్ పేమెంట్ వ్యవస్థతో పాటు బ్యాంకు రుణాల విషయంలో పెను మార్పులు వస్తాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.


Similar News