హిండెబ్‌బర్గ్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న అదానీ!
హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా దెబ్బతిన్న గౌతమ్ అదానీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా దెబ్బతిన్న గౌతమ్ అదానీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఆయన అమెరికాలో న్యాయ పరిష్కారాలను అందించే అత్యంత ఖరీదైన వాచ్‌టెల్ సంస్థను నియమించుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా తన పెట్టుబడిదారుల్లో తిరిగి విశ్వాసాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతోనే గౌతమ్ అదానీ ప్రయత్నిస్తున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పలు నివేదికల ప్రకారం.. హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్రూప్ మార్కెట్ విలువ కొన్ని లక్షల కోట్లను కోల్పోవడమే కాకుండా పెట్టుబడిదారుల నమ్మకాన్ని పోగొట్టుకునే స్థాయికి పతనమైంది. దీంతో హిండెన్‌బర్గ్‌పై చట్టపరంగా పోరాడాలని అమెరికాకు చెందిన డిఫెన్స్ లా సంస్థ వాచ్‌టెల్‌ను సంప్రదించారు. దీనిపై కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
మరోవైపు, అదానీ కంపెనీలపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల వరుస నష్టాల తర్వాత ముందస్తు చెల్లింపులతో కంపెనీ మదుపర్ల నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేస్తుండగా, గ్లోబల్ రేటింగ్స్ సంస్థ మూడీస్ గట్టి షాక్ ఇచ్చింది. అదానీ గ్రూపులోని నాలుగు సంస్థల రేటింగ్‌ను 'స్థిరత్వం' నుంచి 'ప్రతికూలత'కు మార్చినట్టు వెల్లడించింది. అందులో అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టెప్-వన్ కంపెనీలున్నాయి.