ప్రభుత్వ ప్రోత్సాహంతో గేమింగ్ పరిశ్రమ సానుకూల వృద్ధి: Gamezop CEO

ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల భారత గేమింగ్ పరిశ్రమ వృద్ధిని సాధిస్తుందని Gamezop సీఈఓ, సహ వ్యవస్థాపకుడు యషాష్ అగర్వాల్ శనివారం అన్నారు.

Update: 2024-03-16 10:04 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల భారత గేమింగ్ పరిశ్రమ వృద్ధిని సాధిస్తుందని Gamezop సీఈఓ, సహ వ్యవస్థాపకుడు యషాష్ అగర్వాల్ శనివారం అన్నారు. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించడం ద్వారా ప్రభుత్వం ఆకర్షణీయమైన వ్యాపార వాతావరణాన్ని పెంపొందించింది. దీని ద్వారా చాలా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ గేమింగ్ సంస్థలతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో భారత్‌లో గేమింగ్ రంగం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దేశం 450-550 మిలియన్ల మంది గేమింగ్ యూజర్లను కలిగి ఉంది. ఇది 2027 నాటికి 650 మిలియన్లకు చేరుతుందని యషాష్ అన్నారు. బడ్జెట్ ధరలో హైఎండ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తుండటం, డేటా ప్లాన్‌లు అందుబాటులో ఉండటం వలన గేమ్స్ డౌన్‌లోడ్‌లలో పెరుగుదల ఉందని తెలిపారు.

2023లో గేమింగ్ పరిశ్రమ రూ.25 వేల కోట్ల($3.1 బిలియన్ల )ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ఇంతకుముందు 2022లో రూ.21 వేల కోట్లు($2.6 బిలియన్ల)గా నమోదైంది. అంటే ఏడాది కాలంలో గేమింగ్ పరిశ్రమ ఆదాయం దాదాపు 19 శాతం వృద్ధిని సాధించింది. ఇన్వెస్ట్ ఇండియా ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ సెగ్మెంట్ భారతీయ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నాల్గవ అతిపెద్ద విభాగం. ఇది 2025 నాటికి 20 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా.


Similar News