5 శాతం తగ్గిన ఇంధన అమ్మకాలు!

దేశవ్యాప్తంగా ఇంధన గిరాకీ నెమ్మదించింది.

Update: 2023-02-09 12:17 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన గిరాకీ నెమ్మదించింది. గతేడాది డిసెంబర్‌లో తొమ్మిది నెలల గరిష్ఠానికి చేరిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, పరిశ్రమల కార్యకలాపాలు తగ్గిన కారణంగా ఈ ఏడాది జనవరిలో ఇంధన వినియోగం పడిపోయింది.

భారత చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) తాజా గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో 1.87 కోట్ల టన్నుల మొత్తం ఇంధన వినియోగం నమోదవగా, ఇది అంతకుముందు నెలతో పోలిస్తే 4.6 శాతం తక్కువ. అదేవిధంగా జనవరిలో డీజిల్ అమ్మకాలు 7.6 శాతం క్షీణించి 71.8 లక్షలకు, పెట్రోల్ 5.3 శాతం తగ్గి 28.2 లక్షల టన్నులకు చేరుకున్నాయని పీపీఏసీ డేటా తెలిపింది.

పండుగ సీజన్ ముగియడంతో పాటు వాతావరణ, కార్యకలాపాలు తగ్గిన నేపథ్యంలోనే ఇంధనానికి డిమాండ్ తగ్గిందని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది భారత తయారీ పరిశ్రమ బలహీనంగా మొదలైంది. వరుసగా మూడో నెల జనవరిలోనూ ఉత్పత్తి నెమ్మదించింది. దీంతో సరఫరా తగ్గి ఇంధన అమ్మకాలు మందగించాయని ఓ నివేదిక వెల్లడించింది.

ఇదే సమయంలో ఇంధన వినియోగం వార్షిక ప్రాతిపదికన 3.3 శాతం పెరగ్గా, డీజిల్ అమ్మకాలు 12.6 శాతం, పెట్రోల్ 14.2 శాతం పెరిగాయని పీపీఏసీ డేటా తెలిపింది. ఎల్‌పీజీ గ్యాస్ 2.1 శాతం తగ్గినట్టు నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News