ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు రెట్లు పెరిగిన మోసాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2024 ఆర్థిక సంవత్సరంలో మోసాలు గత ఏడాది కంటే దాదాపు ఆరు రేట్లు పెరిగినట్లు ఎనిమిది పీఎస్‌బీల వార్షిక నివేదికలో వెల్లడైంది

Update: 2024-07-12 11:44 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2024 ఆర్థిక సంవత్సరంలో మోసాలు గత ఏడాది కంటే దాదాపు ఆరు రేట్లు పెరిగినట్లు ఎనిమిది పీఎస్‌బీల వార్షిక నివేదికలో వెల్లడైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 4,787 మోసాలు జరగ్గా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 28,000కు చేరుకున్నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో రుణ పోర్ట్‌ఫోలియో, నెట్‌బ్యాంకింగ్, కార్డులు, డిజిటల్ చెల్లింపులు, ఇతర సైబర్ మోసాలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించి ఎఫ్‌వై24లో అత్యధికంగా 12,061 మోసాలు జరగ్గా, గత ఏడాది ఎఫ్‌వై23లో 784 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఎఫ్‌వై23లో 289 మోసాలు జరగ్గా ఎఫ్‌వై24లో ఇది 7,112 కు పెరిగినట్లు డేటా పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎఫ్‌వై24 వార్షిక నివేదికలో గత రెండేళ్లుగా ఆన్‌లైన్ మోసాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని పేర్కొంది. నివేదిక ప్రకారం, గత రెండేళ్లలో ఆన్‌లైన్ మోసాల కేసులు 708 శాతం పెరిగి 29,082కి చేరుకున్నాయి.

మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మోసాల సంఖ్య తగ్గిందని నివేదించింది. ఎఫ్‌వై23లో 2,755 కేసులు నమోదు కాగా, ఎఫ్‌వై24కి అది1,586గా ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన 42 శాతం తగ్గింది. గత మూడు సంవత్సరాలలో, సైబర్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి కొత్త సాంకేతికతకు సంబంధించిన బలాన్ని పెంచుకోవడానికి, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సమాచార సాంకేతిక (IT) ఫ్రేమ్‌వర్క్‌పై వ్యయాన్ని పెంచడం ప్రారంభించాయి. వీటితో పాటు ప్రైవేట్ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ వంటివి కూడా తమ వ్యయంలో ఎక్కువ భాగం సైబర్ ప్రమాదాలను ఎదుర్కొడానికి కొత్త టెక్నాలజీపై పెడుతున్నాయి.


Similar News