కొత్త విదేశీ వాణిజ్య విధానం-2023 ప్రకటించిన కేంద్రం!

ఐదేళ్ల పాటు కొనసాగే పాలసీ సంప్రదాయానికి బదులుగా దీర్ఘకాలిక లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్టు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు

Update: 2023-04-01 03:19 GMT

న్యూఢిల్లీ: భారత ఎగుమతులను 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల(సుమారు రూ. 165 లక్షల కోట్ల)కు చేర్చే లక్ష్యంతో శుక్రవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త 'విదేశీ వాణిజ్య విధానం-2023(ఎఫ్‌టీపీ)ని ఆవిష్కరించింది. భారత కరెన్సీ రూపాయిని ప్రపంచ కరెన్సీగా మార్చడంతో పాటు ఈ-కామర్స్ ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అంశాలు కూడా కొత్త వాణిజ్య విధానంలో పొందుపరిచారు. ఐదేళ్ల పాటు కొనసాగే పాలసీ సంప్రదాయానికి బదులుగా దీర్ఘకాలిక లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్టు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 2023, ఏప్రిల్ నుంచి ఈ కొత్త విదేశీ వాణిజ్య విధానం అమల్లోకి వస్తుంది. కొత్త ఎఫ్‌టీపీకి ఎటువంటి గడువు తేదీ లేదని, అవసరమైనపుడు మార్పులు ఉంటాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) సంతోష్ సారంగి అన్నారు. ప్రధానంగా ఈ కొత్త ఎఫ్‌టీపీ ద్వారా రాష్ట్రాలు, జిల్లాలు, భారత మిషన్‌ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, లావాదేవీ ఖర్చులను తగ్గించడం, మరిన్ని ఎగుమతి కేంద్రాల అభివృద్ధి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల విలువ రూ. 62.50 లక్షల కోట్ల(760 బిలియన్ డాలర్ల) నుంచి రూ. 63.32 లక్షల కోట్ల(770 బిలియన్ డాలర్ల) మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 55.60 లక్షల కోట్లుగా నమోదైందని సంతోష్ సారంగి వెల్లడించారు. 2023, మార్చి 31 వరకు అమల్లో ఉన్న విదేశీ వాణిజ్య విధానం 2015, ఏప్రిల్ 1ను అందుబాటులోకి వచ్చింది. దానికి ఐదేళ్ల గడువు ఉన్నప్పటికీ, కోవిడ్ కారణంగా పొడిగిస్తూ వచ్చారు. చివరిగా గతేడాది సెప్టెంబర్‌లో ఈ మార్చి 31కి పొడిగించారు. రాబోయే 4-5 నెలల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ రంగాల వారీగా లేదంటే దేశాల వారీగా గ్లోబల్ మార్కెట్లకు చేరువవుతుందని, విదేశాల్లో ఉన్న భారత మిషన్‌లు ఈ విభాగంతో కలిసి పనిచేస్తాయని పీయూష్ గోయల్ అన్నారు.

రూ. 10 లక్షలకు కొరియర్ సర్వీస్ ఎగుమతుల పరిమితి..

కొత్త విదేశీ వాణిజ్య విధానంలో కొత్త పట్టణాలను 'టౌన్స్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ పద్దతిలో ఎంపిక చేయడం జరిగింది. అందులో వారణాసి, మొరాదాబాద్, ఫరీదాబాద్, మీర్జాపూర్ ఉన్నాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 39 పటణాలు ఈ టౌన్స్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ విభాగంలో ఉన్నాయి. అలాగే, ఎఫ్‌టీపీ-2023 ప్రయోజనాలను ఈ-కామర్స్ ఎగుమతులకు సైతం విస్తరించారు. 2030 నాటికి వీటి విలువ సుమారు రూ. 16.45 లక్షల కోట్ల నుంచి రూ. 24.66 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేయడం జరిగింది. అంతేకాకుండా కొరియర్ సర్వీస్ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని ఒక్కో సరుకుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్టు గోయల్ తెలిపారు. భారత రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చేందుకు ఎఫ్‌టీపీ-2023లో అంతర్జాతీయ ఒప్పందాలు రూపాయిలో జరిగేందుకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి.

కొత్త ఎఫ్‌టీపీ-2023లోని ఇతర ముఖ్యమైన అంశాలు..

* ఎగుమతులను పెంచేందుకు రానున్న నాలుగు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టనున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

* సరుకుల ఎగుమతులపై ప్రభుత్వం విధించే పన్నులు, సుంకాలను తగ్గింపు పొందేలా పథకాన్ని తీసుకొచ్చారు.

* ఎఫ్‌టీపీ-2023 దరఖాస్తులను డిజిటలైజేషన్ చేయడం, ఆయా దరఖాస్తులను సిస్టమ్ ఆధారిత ఆటోమెట్‌కి పద్దతిలో ఆమోదించడం

* అడ్వాన్స్ ఆథరైజేషన్ అప్లికేషన్‌ల ప్రాసెసింగ్‌ను ఒక రోజుకు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టారు.

* సగటు ఎగుమతుల బాధ్యతల నుంచి పాడి పరిశ్రమకు మినహాయింపు

* బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, వ్యవసాయ పరికరాలు, గ్రీన్ హైడ్రోజన్‌లను ఎగుమతి ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్(ఈపీసీజీ) పథకం విస్తరణ.

* టెక్స్‌టైల్ పరిశ్రమకు స్పెషల్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ విస్తరణ.

Tags:    

Similar News