ఈవీ వాహనాల కోసం ఫోర్స్ మోటార్స్ రూ.2 వేల కోట్ల పెట్టుబడులు
వ్యాన్ మోడల్ ఈవీలను మార్కెట్లోకి తీసుకురావాలని, దీన్ని దశలవారీగా చేపట్టనున్నట్టు కంపెనీ ఎండీ ప్రసన్ ఫిరోడియా చెప్పారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అభివృద్ధితో పాటు వివిధ కార్యకలాపాల కోసం వచ్చే మూడు నాలుగేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ప్రధానంగా కంపెనీ తన వ్యాన్ మోడల్ ఈవీలను మార్కెట్లోకి తీసుకురావాలని, దీన్ని దశలవారీగా చేపట్టనున్నట్టు కంపెనీ ఎండీ ప్రసన్ ఫిరోడియా చెప్పారు. పెట్టుబడి మొత్తాన్ని సాంప్రదాయ ఇంధన ఇంజిన్‌లతో పాటు ఈవీ, ఇతర ఇంజనీరింగ్ సౌకర్యాల అప్‌గ్రేడ్ కోసం వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. తాజాగా భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తన ట్రావెలర్ ఈవీ, అర్బేనియా డీజిల్, ట్రావెలర్ సీఎన్‌జీ మోడళ్లను ప్రదర్శించిన కంపెనీ ఇక నుంచి సాంప్రదాయ ఇంజిన్‌లతో పాటు ఈవీ విభాగంపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. మొదటి ఈవీ మోడల్‌గా 'ట్రావెలర్'ను తీసుకొస్తామని ప్రసన్ చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక మోడల్‌ను ఈవీగా మార్చనున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో నాన్-ప్యాసింజర్, పర్సనల్ వెహికల్ మోడల్ 'గూర్ఖా'ని కూడా ఈవీ వెర్షన్‌ని తెచ్చే ప్రణాళికను కలిగి ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో కంపెనీ కార్యకలాపాల్లో 50 శాతం వరకు గ్రీన్ ఎనర్జీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రసన్ పేర్కొన్నారు.