హీరానందానీ గ్రూప్ ప్రమోటర్లకు ఈడీ సమన్లు
రియల్ ఎస్టేట్ డెవలపర్ హీరానందానీ గ్రూప్ ప్రమోటర్లు నిరంజన్ హీరానందనీ, అతని కుమారుడు దర్శన్ హిరానందనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 26న విచారణకు పిలిచినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ డెవలపర్ హీరానందానీ గ్రూప్ ప్రమోటర్లు నిరంజన్ హీరానందనీ, అతని కుమారుడు దర్శన్ హిరానందనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 26న విచారణకు పిలిచినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో(ఫెమా) 26న ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా సమన్లలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. గత వారం ముంబై, చుట్టుపక్కల ఉన్న హిరానందనీ గ్రూప్‌కు చెందిన నాలుగు ప్రాంగణాల్లో ఈడీ సోదాలు చేసింది. విదేశీ లావాదేవీలతో పాటు, ఆ గ్రూప్ ప్రమోటర్లతో సంబంధం ఉన్న బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (BVI) ఆధారిత ట్రస్ట్ లబ్ధిదారులపై కూడా ఈడీ విచారణ జరుపుతుంది.
దర్శన్ హీరానందని గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు. విచారణలో ఈడీకి సహకరిస్తామని గ్రూప్ తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రాకు ఈ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. ఇంతకుముందు దర్శన్ హీరానందానీ ఆదేశాల ప్రకారం, అదానీ గ్రూప్‌ను, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించగా, ఈ విషయం సంచలనం అయిన సంగతి తెలిసిందే.