ED: రూ.29.75 కోట్ల నీరవ్ మోదీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

భారత బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2024-09-11 13:52 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద బ్యాంకు డిపాజిట్లు, భూమి, భవనాల రూపంలో ఉన్న ఈ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బిలియన్ డాలర్ల మోసానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ, గతంలో భారతదేశం, విదేశాలలో రూ. 2,596 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. నీరవ్ మోదీ, అతని సహచరుల రూ. 692.90 కోట్ల చర, స్థిరాస్తులను జప్తు చేసింది. అలాగే, రూ. 1052.42 కోట్లను బాధిత బ్యాంకులకు విజయవంతంగా తిరిగి వచ్చేలా చేసింది. నీరవ్ మోదీ ప్రస్తుతం UK జైలులో ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, అక్కడి కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, దానిని ఏడవసారి కోర్టు తిరస్కరించింది. పరారీలో ఉన్న నీరవ్ మోదీని తిరిగి భారత్‌కు అప్పగించే ప్రక్రియపై విచారణ జరుగుతుంది.


Similar News