FM Sitharaman: అధిక అప్పులతో భవిష్యత్తు తరాలపై భారం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

రాబోయే దశాబ్ద కాలంలో అప్పుల నిర్వహణ, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Update: 2024-12-11 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: బాధ్యత కలిగిన ఏ ఆర్థికవ్యవస్థలైనా భారీ అప్పుల మీద కొనసాగలేవని, దానివల్ల ఆ అప్పులు రాబోయే తరాలపై భారంగా మారుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బుధవారం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్‌లో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. రాబోయే దశాబ్ద కాలంలో అప్పుల నిర్వహణ, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన ఆర్థిక వ్యవస్థలు అధిక మొత్తం రుణాలను తీసుకోవడం ద్వారా కొనసాగలేవు, తరువాతి తరాలు దాన్ని నిర్వహించడం గురించి ఆందోళన చెందుతాయి. దేశాల అప్పులను నిలకడగా నిర్వహించడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు కలిసి పని చేయాలని ఆర్థిక మంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం చాలా దేశాల్లో కీలకమైన సవాలుగా మారిందని, దీన్ని పరిష్కరించడంలో ఏ దేశం కూడా పూర్తిగా విజయం సాధించలేకపోతోందని ఆమె అభిప్రాయపడ్డారు. చాలా దేశాలు ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆస్తుల నిర్మాణానికి మాత్రమే రుణం తీసుకోవాలని చెప్పారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధాలపై నిర్మలా సీతారామన్ ఆద్నోళన వ్యక్తం చేశారు. ప్రపంచ అస్థిరతను తొలగించేందుకు ప్రపంచ స్థిరత్వాన్ని, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల మూలంగా సరఫరా, ఆహార వ్యవస్థలపై ప్రభావం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దీనికోసం పరిశ్రమలు, ప్రభుత్వం, విధానాల రూపకర్తలు, ప్రజలు, ప్రజా సంఘాలు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News