జులైలో బంధన్ బ్యాంకు ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ పదవీ విరమణ

బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ తన పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో జులైలో పదవీ విరమణ చేస్తారని బంధన్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది

Update: 2024-04-05 12:31 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ తన పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో జులైలో పదవీ విరమణ చేస్తారని బంధన్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు 2015 నుండి బ్యాంక్ ఎండీ, సీఈఓ గా సేవలు అందించగా, ఆయన పదవీకాలం జులై 9, 2024న ముగుస్తుంది. ఆ రోజు నుంచి పదవి నుండి రిటైర్ అవుతారని అధికార వర్గాలు ప్రకటించాయి. బంధన్ బ్యాంక్ స్థాపకుడు అయిన ఘోష్ భారత్‌లో మైక్రోఫైనాన్స్, డెవలప్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించారు.

ఒక దశాబ్దం పాటు బ్యాంక్‌ను నడిపించిన తర్వాత, బంధన్ గ్రూప్ స్థాయిలో నేను పెద్ద వ్యూహాత్మక పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. అందుకే, సేవల నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని ఘోష్ తన రాజీనామా లేఖలో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. నా నాయకత్వంలో బ్యాంక్‌పై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను, సమర్థవంతమైన నాయకత్వ బృందం చేతిలో బ్యాంకు ఉంది, వీరిలో చాలామంది సంస్థను అట్టడుగు స్థాయి నుంచి నిర్మించడంలో భాగస్వామ్యం అయ్యారు. బంధన్ బ్యాంక్‌కు నా హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. బ్యాంక్‌కు అవసరమైన ఏదైనా సహాయం లేదా సలహా కోసం నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని ఘోష్ అన్నారు.

బంధన్ బ్యాంకును చంద్రశేఖర్ ఘోష్ 2015లో స్థాపించారు. దాదాపు 9 సంవత్సరాలలో రూ. 1.35 లక్షల కోట్లను డిపాజిట్లను సాధించింది. బ్యాంకులో 3 కోట్ల మంది రుణగ్రహీతలు, డిపాజిటర్లు ఉన్నారు. 75000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.


Similar News