ప్రమాదంలో ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ మరణం
క్లింగ్ చేస్తున్న సమయంలో ఓ క్యాబ్ ఢీకొనడం వల్ల ఆయన తీవ్ర గాయపడ్డారని స్థానికులు తెలిపారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైని మృతి చెందారు. గురువారం ఉదయం నవీ ముంబైలోని టౌన్‌షిప్‌లో సైక్లింగ్ చేస్తుండగా ప్రమాదం బారిన పడి ఆయన మరణించినట్టు తెలుస్తోంది. సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఓ క్యాబ్ ఢీకొనడం వల్ల ఆయన తీవ్ర గాయపడ్డారని స్థానికులు తెలిపారు. తక్షణం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అవతార్ సైనీ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఘటనకు కారణమైన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు. కాగా, అవతార్ సైనీ ఇంటెల్‌కు సంబంధించి 386,486 మైక్రోప్రాసెసర్‌లను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా పెంటియం ప్రాసెసర్ డిజైన్ చేసే బృందానికి హెడ్‌గా పనిచేశారు. ఇంటెల్ దక్షిణాసియా విభాగం డైరెక్టర్‌గా కూడా అవతార్ సైనీ బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతిపై ఇంటెల్ సంస్థ సంతాపం వ్యక్తం చేసింది. ఉత్తర లీడర్‌గా, మెంటార్‌గా సైనీ తమకు ఎల్లప్పుడూ గుర్తుంటారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ గోకుల్ వి సుబ్రమణ్యం సైనీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.