యాపిల్ రెండవ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్!
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ గురువారం న్యూఢిల్లీలో తన రెండవ స్టోర్‌ను ప్రారంభించింది.
న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ గురువారం న్యూఢిల్లీలో తన రెండవ స్టోర్‌ను ప్రారంభించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా ఢిల్లీలోని 'యాపిల్ సాకెత్ ' స్టోర్ తలుపులు తెరిచి వినియోగదారులకు స్వాగతం పలికారు. సెలెక్ట్ సిటీవక్ మాల్‌లో యాపిల్ స్టోర్ ఉండగా, ముంబై స్టోర్ విస్తీర్ణంలో సగమే ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాల్‌లోని కొంత భాగాన్ని యాపిల్ కంపెనీ అద్దెకు తీసుకోగా, మొత్తం అమ్మకాల్లో కొంత భాగం లేదా నెలకు రూ. 40 లక్షలు, ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.
ఢిల్లీలోని యాపిల్ సాకెత్ స్టోర్‌లో 70 మంది వరకు ఉద్యోగులు వినియోగదారులకు సేవలందించనుండగా, వీరు మొత్తం 15 భాషల్లో మాట్లాడగలరు. అంతకుముందు మంగళవారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో యాపిల్ బీకేసీ పేరుతో దేశంలోనే మొట్టమొదటి స్టోర్‌ను టిమ్ కుక్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలిశారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అంతేకాకుండా దేశంలో యాపిల్ కాంట్రాక్టు తయారీ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యను 2 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు స్పష్టం చేశారు.
Also Read..
చివరి గంట వరకు ఉత్కంఠ.. ఆఖరికి స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!