వచ్చే వారం నుంచి రూ. 2,000 నోట్లను తీసుకోమని ప్రకటించిన అమెజాన్!
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న తర్వాత నోట్లు మార్చుకునేందుకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.
బెంగళూరు: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న తర్వాత నోట్లు మార్చుకునేందుకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కంపెనీ క్యాష్ ఆన్ డెలివరీ సేవల్లో రూ. 2,000 నోట్లను తీసుకోమని ప్రకటించింది. పెద్ద నోట్ల డిపాజిట్, మార్పిడికి గడువు సమీపిస్తున్న కారణంగానే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రూ. 2 వేల నోట్లను తీసుకుంటున్నామని, 19 తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులకు అంగీకరించమని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఏడాది మే నెలలో ఆర్‌బీఐ చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా నోట్లను ప్రజలు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 1వ తేదీ వరకు 90 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.