Amazon: 2025 నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీసులోనే: అమెజాన్ సీఈఓ
కోవిడ్ ప్రభావం తగ్గినప్పటికీ హైబ్రిడ్ విధానంతో ఉద్యోగులకు అనుకూలమైన పని విధానాన్ని కంపెనీ కొనసాగించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది నుంచి అమెజాన్ ఉద్యోగులు వారంలో ఐదు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని సంస్థ సీఈఓ ఆండీ జస్సీ స్పష్టం చేశారు. ఈ మేరకు మెయిల్ ద్వారా ఆయన తన సందేశాన్ని పంపారు. 'కొవిడ్‌కు ముందు ఎలా ఉన్నామో ఆ విధంగా ఆఫీసు పని వాతావరణాన్ని ఆశిస్తున్నాం. గత ఐదేళ్లలో ఉన్న పనితీరుతో పోలిస్తే ఉద్యోగులు ఆఫీసులకు రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో, అదెంత ముఖ్యమో సమీక్షించామని' ఉద్యోగులకు పంపిన సుధీర్ఘ నోట్‌లో జస్సీ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. ఆ తర్వాత కోవిడ్ ప్రభావం తగ్గినప్పటికీ హైబ్రిడ్ విధానంతో ఉద్యోగులకు అనుకూలమైన పని విధానాన్ని కొనసాగించింది. తద్వారా ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేసేలా ప్రోత్సహించింది. ఈ క్రమంలో తాజాగా రిమోట్ పని విధానంపై తన వైఖరిని మార్చుకుంటూ వారంలో ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని సీఈఓ జస్సీ స్పష్టం చేశారు. గత 15 నెలల నుంచి వారంలో మూడు రోజుల పనివిధానాన్ని అమలు చేయడం ద్వారా కలిగిన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
కొన్ని మినహాయింపులు..
2025, జనవరి 2 నుంచి ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని కంపెనీ పేర్కొంది. అయితే, సంస్థకు చెందిన ఎస్-టీమ్ లీడర్ ఆమోదం ద్వారా ఎవరైనా ఉద్యోగులు రిమోట్ పద్దతిలో పని చేయవచ్చన్ని సీఈఓ పేర్కొన్నారు. ఈ ఎస్-టీమ్ నేరుగా సీఈఓకు నివేదిక అందించే ఎగ్జిక్యూటివ్‌ల బృందం. కాబట్టి కొంతమంది ఉద్యోగుల రిమోట్ పని విధానం కొనసాగించడంపై టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.