అమెజాన్‌పే సహా 32 కంపెనీలకు పేమెంట్ అగ్రిగేటర్‌లుగా ఆర్‌బీఐ అనుమతి!

అమెజాన్‌పే సహా 32 కంపెనీలకు పేమెంట్ అగ్రిగేటర్‌గా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం ప్రకటనలో తెలిపింది.

Update: 2023-02-15 16:38 GMT

ముంబై: అమెజాన్‌పే సహా 32 కంపెనీలకు పేమెంట్ అగ్రిగేటర్‌గా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం ప్రకటనలో తెలిపింది. దేశీయంగా డిజిటల్ చెల్లింపుల విధానం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయా కంపెనీలకు ఆమోదం తెలిపామని ఆర్‌బీఐ వెల్లడించింది. చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 ప్రకారం ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్లుగా కొనసాగేందుకు అనుమతిని కోరుతూ దరఖాస్తులు ఇచ్చిన కంపెనీల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది.

ఈ కంపెనీలు వ్యాపారులు వినియోగదారుల నుంచి నగదును స్వీకరించేందుకు గేట్‌వేలుగా పనిచేస్తాయి. దీనివల్ల వేగవంతమైన, సులభమైన రీతిలో ఆన్‌లైన్ చెల్లింపులు జరిగేందుకు వీలుంటుంది. ఆర్‌బీఐ అనుమతిచ్చిన కంపెనీల జాబితాలో అమెజాన్‌పేతో పాటు జొమాటో పేమెంట్, క్యాష్‌ఫ్రీ పేమెంట్, గుగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్, రేజర్‌పే సాఫ్ట్‌వేర్, రిలయన్స్ పేమెంట్ సొల్యూషన్స్ సహా పలు కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నాయి.

ఇదే సమయంలో పేమెంట్ అగ్రిగేటర్‌గా దరఖాస్తు పంపినప్పటికీ కొన్ని కంపెనీలకు ఇంకా అనుమతి రాలేదు. వాటిలో భారతీ పే సర్వీసెస్, ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్ సహా మొత్తం 18 కంపెనీలు ఉన్నాయి.

Tags:    

Similar News